ఏపీ సీఎంకు మరోసారి తలనొప్పి మొదలవుతోంది. నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమం జోరుగా సాగింది.. దాదాపు 2,3 నెలల పాటు పీఆర్సీ అంశం ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. మొత్తానికి ఏదో రకంగా కొన్ని విషయాల్లో ఉద్యోగులను సంతృప్తి పరిచి వారి ఆగ్రహాన్ని చల్లబరిచి సమ్మె ప్రయత్నం విరమించుకనే ఏర్పాటు చేశారు.. దీంతో కాస్త జగన్ ఊపిరి పీల్చుకున్నారు. కాస్త రిలాక్స్ అవుతున్నారు.


మళ్లీ ఇంతలోనే మరో తలనొప్పి మొదలైంది.. అదేంటంటే.. ఈసారి విద్యుత్ శాఖ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆందోళనలకు కారణం వేతనాలు సకాలంలో అందకపోవడమే..   ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవటంతో ఇవాళ్టి నుంచి సహాయ నిరాకరణకు వెళ్లాలని ఏపీ జెన్ కో ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. ఏపీ జెన్ కో  ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకూ వేతనాలు, పెన్షన్ చెల్లించలేదని చెబుతున్నారు. అందువల్ల ఇవాళ్టి నుంచి ఏపీ జెన్ కో సంస్థల్లో సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు ఇంధన శాఖ కార్యదర్శికి ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ  లేఖ రాసింది.


జనవరి నెల వేతనాలను ఇప్పటి వరకూ చెల్లించకపోవటంపై జెన్‌కో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు చెల్లించేంత వరకూ సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామని ఉద్యోగ సంఘాలు  స్పష్టం చేశాయి. దాదాపు సగం నెల గడచిపోతున్నా.. ఇంకా జీతాలు ఇవ్వకపోవడం ఏంటని నిలదీస్తున్నాయి.


మరోవైపు ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టీసీగా ఉన్నప్పుడే తమకు అనేక సౌకర్యాలు ఉండేవని.. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత వాటిని తీసేశారని.. అంతకు ముందే బావుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపంతోనే మొన్నటి ఉద్యోగుల సమ్మెకు కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మద్దతు ఇచ్చాయి. సమ్మె అంటూ జరిగితే తాము కూడా పాల్గోవాలని నిర్ణయించాయి. మరి సీఎం జగన్ అటు విద్యుత్‌ ఉద్యోగులు, ఇటు ఆర్టీసీ ఉద్యోగులు.. వీరిద్దరి సమస్యలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: