సినీరంగ దిగ్గజం రామానాయుడు కుటుంబానికి ఇది ఓ అద్భుతమైన గుడ్ న్యూస్.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూములపై హైకోర్టు ఆయన కుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ భూములు తమవేనంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. ఖానామెట్‌లో 1996లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం ఈ భూమి కొనుగోలు చేసింది. 26.16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కుల వివాదంలో ఇటీవల సింగిల్‌ జడ్జి ఆయన కుటుంబానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.


అయితే.. తెలంగాణ ప్రభుత్వం దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. దీనిపై సుదీర్ఘ వాదనలను విన్న ధర్మాసనం అన్ని అంశాలను పరిశీలించింది. రామానాయుడు తదితరులు రికార్డును తారుమారు చేశారని, మోసపూరిత పత్రాలు సృష్టించారని ఆరోపణలు లేవని గుర్తు చేసింది. రికార్డుల్లో కూడా అలాంటి ఆరోపణలు లేవని తెలిపింది. 1961లో అసైన్‌మెంట్‌ తప్పని ప్రభుత్వం చెబుతున్నా.. 1963లో మాజీ సైనికులకు భూమి కేటాయింపు జీవో వచ్చినపుడు, గతంలో చేసిన అసైన్‌మెంట్‌ రద్దుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.


ఈ భూమిని కేటాయించిన 5 దశాబ్దాల తరువాత ఇప్పుడు చర్యలు తీసుకోవడం సమంజసం కాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.  అనుబంధ సేత్వార్‌ జారీ చేసిన 15 ఏళ్ల తరువాత చర్యలు ప్రారంభించడం సరి కాదని హైకోర్టు వ్యాఖ్యానిచింది. అనుబంధ సేత్వార్‌ను రద్దు చేయడం చెల్లదని.. ఆ భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదని ఇటీవల సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ సింగిల్ జడ్డి తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించలేదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. చివరకు ప్రభుత్వ అప్పీళ్లను కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.


హైకోర్టు తీర్పుతో రామానాయుడితో పాటు ఇదే భూమి విషయంలో రాఘవేంద్రరావు.. తదితరులకు కూడా ఉపశమనం లభించింది. వందల కోట్ల రూపాయల భూముల విషయంలో హైకోర్టు తుది తీర్పు ఇవ్వడంతో రామానాయుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: