బీజేపీ రాజకీయ వ్యూహాలు మరీ అరాచకంగా మారుతున్నాయా.. మహారాష్ట్ర వంటి చోట్ల ఏక్‌నాథ్ షిండేలను ప్రోత్సహించి చేసిన రాజకీయం ఇతర రాష్ట్రాలలోనూ అమలు చేయబోతోందా.. చివరకు 70 స్థానాలకు 67 స్థానాలు ఆప్ గెలుచుకున్న ప్రాంతాల్లోనూ అస్థిరత కోసం బీజేపీ ప్రయత్నిస్తోందా.. అంటే అవునంటున్నారు ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆప్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ 40మంది ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసిందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు.


ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు 20కోట్లు ఆఫర్‌ చేసినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. అలా ఆఫర్ చేసిన 800 కోట్లు ఎక్కడివో దేశ ప్రజలకు చెప్పాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు. అయితే.. ఆప్‌ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతోంది. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆప్ సర్కారు.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల పేరుతో నాటకం ఆడుతోందని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. నిన్న ఆప్‌ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.


ఈ సమావేశానికి రెండు రోజుల ముందు నుంచి 12 మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోవడం కలకలం రేపింది. అయితే చివరకు భేటీకి వారు హాజరుకావటంతో ఆప్‌ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఆప్ మంత్రులే లక్ష్యంగా సీబీఐ, ఈడీ దాడులు  నిర్వహిస్తూ ఆప్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తుతన్నారు. నిన్న జరిగిన ఆప్ ఎమ్మెల్యేల  సమావేశానికి కేజ్రీవాల్‌ సహా 53మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.


మరో ఏడుగురు శాసనసభ్యులు ఈ భేటీకి రాలేదు. అయితే.. వారు ఇతర ప్రాంతాల్లో ఉన్నారని ఆప్ నేతలు చెబుతున్నారు. మొత్తం ఆప్‌ పార్టీని చీల్చేందుకు 12మంది ఎమ్మెల్యేలను బీజేపీ  నేతలు సంప్రదించారట. అయితే వారు బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని ఆప్ నేతలు చెబుతున్నారు. మొత్తం 40 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందట. ఒక్కొక్కరికి 20 కోట్లు ఎర వేసినట్లు చేసినట్లు ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

aap