ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబన్ల రాజ్యం నడుస్తోంది. తాలిబన్ల రాజ్యమంటే అరాచకమన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు అక్కడ ఇప్పుడు కొత్త కొత్త టెర్రరిస్టు మూకలు పుట్టుకొస్తున్నాయి. కొత్తగా పంజా విసురుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాజాగా ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ప్రాబల్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది ఇండియాకు ఇబ్బందిగా మారుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో టెర్రరిస్టు మూకలు ఉంటే ఇండియాకు ఏంటి ఇబ్బంది అంటారా.. అక్కడి నుంచే టెర్రరిస్టులు ఇండియాకు దిగుమతి అవుతున్నారు.


ఇప్పటికే పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే-తొయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలతో ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఇటీవల రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాయి. ఇండియాను అంతమొందిస్తామంటూ ప్రకటిస్తున్నాయి. దీంతో ఇండియా ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లింది. ఈ టెర్రరిస్టు మూకలు తమ శాంతి, సుస్థిరతకు ముప్పుగా పరిణమించాయని భారత్‌ ఐరాసలో తెలిపింది.


ఆఫ్ఘనిస్తాన్‌ లో అధికారంలో ఉన్న తాలిబన్లు ఉగ్రవాద వ్యతిరేక చర్యల హామీని నిలబెట్టుకునేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఐక్య రాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ సూచించారు. చైనా అధ్యక్షతన జరిగిన భద్రతా మండలి సమావేశంలో రుచిరా కాంబోజ్‌  మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ ఉగ్రవాదుల సంఖ్యతోపాటు దాడుల సామర్థ్యం పెరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.


ఆ టెర్రరిస్టులు ఇతర దేశాల్లో దాడులకు సంబంధించి బెదిరిస్తున్న విషయాన్ని రుచిరా కాంబోజ్‌ ప్రస్తావించారు. అదే సమయంలో కాబూల్‌లో జూన్‌ 18న సిక్కుల గురుద్వారాపై దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.  జులై 27న అదే గురుద్వారా ముందు మరో పేలుడు ఘటన గురించి కూడా వివరించారు. ఇలాంటి వరుస దాడులు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని రుచిరా కాంబోజ్‌ తెలిపారు. ఉగ్రవాద ముఠాలకు ఐక్యరాజ్య సమితి కట్టడి చేయాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: