తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుతో కేసీఆర్ నేరుగా ప్రధాని మోదీ, అమిత్ షా వంటి పెద్దలను ఢీకొంటున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్ సర్కారు న్యాయ పోరాటం విషయంలో రాజీ పడటం లేదు. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను  ఏర్పాటు చేసింది.


ఈ త్యేక దర్యాప్తు బృందానికి  హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో... ఆరుగురు పోలీసు అధికారులున్నారు. వీరిలో నల్గొండ S.P రెమా రాజేశ్వరి, సైబరాబాద్ నేర విభాగం D.C.P కల్మేశ్వర్, శంషాబాద్ D.C.P జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట S.P వేంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ A.C.P గంగాధర్, మెయినాబాద్ C.I లక్ష్మీరెడ్డి తదితరులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎన్నో ఆధారాలు సేకరించాల్సి ఉన్నందు వల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.


అనేక శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల సేకరణతో ముడిపడి ఉన్న దర్యాప్తును సిట్ అధికారులు ముందుకు తీసుకెళ్తారని తెలంగాణ హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వుల్లో  పేర్కొన్నారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే. తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను మెయినాబాద్ పోలీసులు 28వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు అంతా మెయినాబాద్ పోలీసుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం చేతుల్లోకి వెళ్లబోతోంది.


నిందితులను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధ్వర్యంలో ప్రశ్నిస్తుంది. నిందితులు పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావించడంతో సిట్ దానిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. నిందితులు  రాంచంద్ర భారతి నకిలీ ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు కూడా నమోదైంది. వీటిపైనా సిట్ అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో మోదీ, అమిత్ షా వంటి వారి ప్రమేయాన్ని తెలంగాణ పోలీసులు నిరూపించగలరా అన్నది సవాల్‌ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: