కరోనా లాక్ డౌన్ ఎత్తేసి, అన్ లాక్ నిబంధనలు వచ్చిన తర్వాత మొదటగా సినిమా థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ ప్రకారం సినిమాలు వేసుకోవచ్చని మార్గదర్శకాలనిచ్చింది ప్రభుత్వం. అంటే 100 సీటింగ్ కెపాసిటీ ఉంటే 50 టికెట్లు మాత్రమే అమ్మేవారు. కుటుంబ సభ్యులు కూడా సీటు వదిలి సీటులో కూర్చోవాల్సిందే. అయితే ఆ నిబంధనను త్వరగానే ఎత్తేసి, 100శాతం ఆక్యుపెన్సీ అమలు చేస్తున్నారు. ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి అలాంటి నిబంధన తెరపైకి వస్తుందనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విధానం అమలులోకి వస్తే తొలి దెబ్బ పడేది వకీల్ సాబ్ పైనే.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాకి బెనిఫిట్ షో లు క్యాన్సిల్ చేసి అభిమానుల్ని హర్ట్ చేశారనే అపవాదు ప్రభుత్వంపై పడింది. అటు ప్రభుత్వ వర్గాలు మాత్రం తమ చర్యను సమర్థించుకుంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్న వేళ, బెనిఫిట్ షో ల పేరుతో అభిమానుల తాకిడి పెంచి కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణం అయ్యే కంటే, వాటిని రద్దు చేయడమే ఉత్తమం అని అంటున్నారు. ప్రభుత్వం అదే చేసిందని సమర్థించుకుంటున్నారు. అదే సమయంలో టికెట్ రేటుని కంట్రోల్ లో ఉంచడం వల్ల కూడా ఎక్కువమంది సినిమాలు చూడగలిగారని, ఇది అభిమానులకు మంచి వార్తే కదా అని సర్ది చెబుతున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో సినిమా థియేటర్లపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. అటు కర్నాటకలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీటింగ్ రూల్ అమలులోకి వచ్చింది. అయితే అప్పటికే అక్కడ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమా విడుదలై ఉండటంతో.. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. నేరుగా హీరో పునీత్ రాజ్ కుమార్, సీఎం యడ్యూరప్పని కలసి 100శాతం సీటింగ్ తో సినిమాలు రన్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు. అందుకే సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే మాత్రం వకీల్ సాబ్ కి కష్టకాలమేనంటున్నారు సినీ జనాలు. తెలంగాణలో స్కూల్స్ మూసివేసి, సినిమా థియేటర్లు, బార్లు ఎందుకు తెరచి ఉంచారని, సమాధానం చెప్పాలంటూ ఇటీవలే హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లపై నిబంధనలు విధించడంపై ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. అది ఆచరణలోకి వస్తే నిర్మాతలు ఇబ్బందుల్లో పడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: