మక్కల్ నీది మయ్యం పార్టీని పెట్టి తమిళనాడులో దీర్ఘ కాలిక రాజకీయాలు చేయాలని అనుకున్నారు కమల్ హాసన్. 2019 లోక్ సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం అభ్యర్థుల హడావిడి బాగానే కనిపించింది. అదే ఊపులో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ని సైతం టార్చి లైటుతో ఎదుర్కొన్నారు కమల్ హాసన్. కానీ ఇక్కడ ఫలితం తేడా కొట్టింది. డీఎంకే, అన్నాడీఎంకే పోటీలో లేకుండా మిత్ర పక్షాలకు వదిలేసిన సీటులో కూడా కమల్ హాసన్ గెలవలేకపోయారు. అక్కడ నేరుగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని, కమల్ కు కనీస స్థాయిలో కూడా ఓట్లు వచ్చేవి కావనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే కమల్ మాత్రం ఒంటరి పోరాటం చేశారు, చివరకు పరాజయం పాలయ్యారు. కనీసం కమల్ హాసన్ పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థులు కూడా ఎక్కడా కనీస ప్రభావం చూపించలేకపోయారు

వాట్ నెక్ట్స్..?
ఎన్నికలకు ముందే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి రజినీకాంత్ హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టారనే విషయం తేలిపోయింది. కమల్ హాసన్ మాత్రం ఇటు రాజకీయాలు, అటు సినిమాలు అంటూ రెండు పడవలపై కాళ్లు పెట్టారు. ప్రస్తుతానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కమల్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. రెండు రోజులుగా సోషల్ మీడియాకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. తమిళనాడులో జరిగిన తాజా ఎన్నికల్లో ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకే మినహా.. మిగతా చిన్నా చితకా పార్టీలను లెక్కలోకి తీసుకోలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంటే కమల్ దీర్ఘకాలిక రాజకీయాలు చేసినా కూడా ఫలితం ఉంటుందో లేదో అనుమానమే.

ప్రస్తుతానికి విరామమే...
ఇప్పటికిప్పుడు తమిళనాట ఏ ఎన్నికలు జరిగినా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తూ ఉంటుందనే విషయం వాస్తవం. లోక్ సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్ ఉంది. ఈలోగా రాజకీయంగా బలపడటం, స్టాలిన్ హవా ముందు కమల్ కి సాధ్యమయ్యే పనేనా అనేది అనుమానమే. అయితే అన్నాడీఎంకేలో నాయకత్వలేమి పరోక్షంగా ఇతర పార్టీలకు వరంగా మారే అవకాశం కూడా ఉంది. చిన్నమ్మ రీఎంట్రీ ఇచ్చి మళ్లీ హవా చూపిస్తే మాత్రం అన్నాడీఎంకే పుంజుకునే అవకాశం ఉంటుంది. అంతేకానీ.. కమల్ హాసన్ లాంటి నాయకులకు మాత్రం తమిళనాడులో చోటు కనిపించేలా లేదు. ప్రస్తుతానికయితే తమిళనాడులో రాజకీయంగా కమల్ సైలెంట్ గా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాలతో మళ్లీ ఆయన బిజీ అవుతారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: