పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న రెండు సినిమాలు, అలానే త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మరొక రెండు సినిమాలకు సంబంధించి నేడు లేటెస్ట్ అప్ డేట్స్ ని ఆయా సినిమాల యూనిట్స్ విడుదల చేసాయి. ముందుగా పవర్ స్టార్ పోలీస్ అధికారిగా నటిస్తున్న భీమ్లా నాయక్ నుండి టైటిల్ సాంగ్ ని విడుదల చేసారు. రానా దగ్గుబాటి కూడా ఒక ముఖ్యమైన రోల్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర తీస్తున్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

ఇక ఈ నేడు విడుదల చేసిన సాంగ్ పై పవన్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అది వారు ఆశించిన రేంజ్ లో అయితే లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ సాంగ్ ని థమన్, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, రామ్ మిరియాల ఆలపించారు. నిజానికి ఈ సాంగ్ లిరిక్స్ ని రామజోగయ్య ఎంతో అద్భుతంగా అందించినప్పటికీ థమన్ అందించిన ట్యూన్ కొంత నీరసంగా ఉందని కొందరు ప్రేక్షకాభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. తాము భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ని ఎంతో మాస్ స్టైల్ లో ఊహించాం అని, కానీ సాంగ్ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉందంటున్నారు.

అయితే మరికొందరు మాత్రం సాంగ్ ఎంతో బాగుందని, థమన్ కు ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నారు. మొత్తంగా ఈ సాంగ్ పై, ప్చ్ అంతగా ఆకట్టుకునేలా లేదు అనేలా మిశ్రమ స్పందన అయితే వినిపిస్తోంది. కాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకు 6 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని అలానే 690కె లైక్స్ ని సొంతం చేసుకుని దూసుకెళ్తుండడం విశేషం. మరి ఈ సినిమాలో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే ఈ సినిమాతో పాటు పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ లేటెస్ట్ పోస్టర్, అలానే త్వరలో ప్రారంభం కానున్న హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లా సినిమాల నుండి కూడా ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్టర్లను విడుదల చేసారు. మొత్తంగా పవన్ ఫ్యాన్స్ కి నేడు వరుసగా ఒకదానితరువాత మరొకటి అప్ డేట్స్ ఎంతో ఆనందాన్నిచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: