అవును.. ద‌క్షిణాది సినిమాల‌ను చూసి ఇప్పుడు బాలీవుడ్ హీరోలు భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌, కోలీవుడ్ నుంచి భారీ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయంటే త‌మ చిత్రాలు వాటికి పోటీగా రిలీజ్ చేసేందుకు కాస్త వెనుక ముందు చూసుకుంటున్నారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లితో తెచ్చిన మార్పు చిన్న‌దేమీ కాదు. ప్ర‌భాస్ న‌టించిన బాహుబ‌లి చూశాక..తెలుగు భాష నేర్చుకుని మ‌రీ రెండో భాగం కోసం ఎదురు చూశామ‌ని ఇత‌ర ప్రాంతాల్లోని సినిమా అభిమానులు అప్పట్లో సోష‌ల్ మీడియాలో చెప్పేవారు. నిజానికి బాహుబ‌లి ఇత‌ర భాషల్లోకి అనువాద‌మై ఏక‌కాలంలో విడుద‌లైంది. అయినా మాతృక తెలుగు వెర్ష‌న్ నే చూడాల‌ని అనిపించ‌డ‌మంటే అది తెలుగు సినిమాపై దేశవ్యాప్తంగా పెరిగిన క్రేజ్ అనే చెప్పాలి. గ‌తంలో షోలే వంటి ఆల్‌టైమ్ క్లాసిక్ బాలీవుడ్ సినిమాల‌కు మాత్ర‌మే ద‌క్కిన గౌర‌వం అది. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ ఒక్క‌డే ప్యాన్ ఇండియా హీరో కాదు. డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ పుష్ప సినిమా ఓపెనింగ్స్ చూశాక ప్ర‌ముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ క‌ర‌ణ్‌జోహార్ తెలుగు హీరోల సినిమాల‌తో పోటీ ప‌డ‌టం బాలీవుడ్ చిత్రాల‌కు సాధ్యం కావడం లేద‌ని బ‌హిరంగంగా వ్యాఖ్యానించ‌డం తెలిసిందే. మిక్స్‌డ్ టాక్‌తోనే బాక్సాఫీసును షేక్ చేస్తున్న బ‌న్నీ చిత్రం ఒక‌వేళ  సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టించేదో.
           
          ఇక మ‌రోవారం రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ కు ఎదురు వ‌చ్చేందుకు బాలీవుడ్ సినిమాలు ఏవీ సిద్ధంగా లేవు. షాహిద్ క‌పూర్ జెర్సీ చిత్రాన్నిఎందుకొచ్చిన రిస్క్ అనుకుని వాయిదా వేసుకున్నారు. వాళ్లు చెప్పిన కార‌ణం కోవిడ్ కేసులు పెరుగుతుండ‌టం. కానీ రాజ‌మౌళి మాత్రం త‌మ చిత్రం ఆగేదే లేద‌ని తేల్చి చెపుతుండ‌టం బ‌హుశా త‌న క‌ష్టం మీద త‌న‌కు ఉన్న న‌మ్మ‌కమేన‌ని చెప్పాలేమో. ఇక ఆర్ఆర్ఆర్ త‌రువాత తార‌క్‌, చెర్రీలు కూడా ప్యాన్ ఇండియా హీరోలుగా మారిపోవ‌డం ఖాయమ‌నే ఫిక్స్ అయిపోవ‌చ్చు. ఆ త‌రువాత లైన్లో ఉన్న కేజీఎఫ్ -2 త‌రువాత క‌న్న‌డ హీరో య‌ష్ కూడా ఈ లిస్టులో చేరిపోతాడ‌నే అంచ‌నాలు ఉన్నాయి. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ వంటి మేటి సౌత్ న‌టులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినా బాలీవుడ్‌పై వారి ప్ర‌భావం ప‌రిమిత‌మే. కానీ యువ‌ద‌ర్శ‌కులు, న‌వ‌త‌రం హీరోలు ఆ ప‌రిస్థితిని స‌మూలంగా మార్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: