తెలుగులో మూడు ద‌శాబ్దాలుగా తిరుగులేని మాస్ ఇమేజ్ తో  స్టార్ హీరోగా వెలుగొందుతున్న‌ మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ లోనూ న‌టించినా ఎందుకనో అక్క‌డ విజ‌య‌వంతం కాలేక‌పోయార‌నే చెప్పాలి. ఆయ‌న‌కంటే ముందు సౌత్ నుంచి వెళ్లి అక్క‌డ న‌టించిన ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ మాత్రం మంచి గుర్తింపునే పొందారు. ఆ త‌రువాత రాంగోపాల్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హిందీలో రేమేక్ అయిన‌ శివ చిత్రం సంచ‌ల‌న విజ‌యంతో నాగార్జునకు కూడా అక్క‌డ మంచి క్రేజ్ సంపాదించ‌డంతో ఆ త‌రువాత కూడా ప‌లు సినిమాల్లో న‌టించాడు. ఇక సురేష్ మూవీస్ బ్యాన‌ర్‌పై వెంక‌టేష్ హీరోగా నిర్మిత‌మైన అనారి చిత్రం సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో అత‌డికి మంచి గుర్తింపు వ‌చ్చినా ఆ త‌రువాత అది కొన‌సాగ‌లేదు. ఇక చిరంజీవి తొలిసారిగా హిందీతెర‌కు ప‌రిచ‌య‌మైంది ప్ర‌తిబంధ్ చిత్రంతో. ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో జుహీచావ్లా చిరు స‌ర‌స‌న క‌థానాయికగా న‌టించింది. 1990లో ఇది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అంటే ముప్పై ఏళ్ల క్రితమే మ‌న హీరోలు బాలీవుడ్ బాక్సాఫీసుపై క‌న్నేయ‌డం మొద‌లైంద‌న్న‌మాట‌.

      తెలుగులో రాజ‌శేఖ‌ర్ హీరోగా వ‌చ్చి ఘ‌న‌విజ‌యం సాధించిన అంకుశం చిత్రానికి ప్ర‌తిబంధ్ రీమేక్ కావ‌డం విశేషం. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చిరంజీవి న‌ట‌న‌కు మంచి గుర్తింపే వ‌చ్చినా చిత్రం మాత్రం యావ‌రేజ్ టాక్‌నే తెచ్చుకుంది. ఆ త‌రువాత రెండేళ్ల‌కు ఆజ్‌కా గూండారాజ్ చిత్రంతో మ‌రోసారి చిరంజీవి బాలీవుడ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తెలుగులో సూప‌ర్ హిట్ చిత్రంగా నిలిచిన గ్యాంగ్‌లీడ‌ర్  చిత్రానికి ఇది హిందీ రీ మేక్‌. మీనాక్షి శేషాద్రి క‌థానాయిక కాగా దీనికి కూడా ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇది మంచి అంచ‌నాల‌తో వ‌చ్చినా బాక్సాఫీసు వ‌ద్ద బాలీవుడ్ హీరోల చిత్రాల ముందు నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఆ త‌రువాత మూడో ప్ర‌య‌త్నంగా చిరంజీవి బాలీవుడ్‌లో న‌టించిన చిత్రం ది జెంటిల్‌మేన్‌. అర్జున్ హీరోగా వ‌చ్చి తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన జెంటిల్‌మ‌న్ చిత్రానికి హిందీ రూప‌మిది. ఈ చిత్రం త‌మిళ మాతృక‌తోనే శంక‌ర్ తొలిసారిగా మెగా ఫోన్ ప‌ట్టాడు. కాగా హిందీ రీమేక్‌ను ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌హేష్‌భ‌ట్ తెరకెక్కించాడు. మ‌రోసారి జుహీచావ్లా చిరు స‌ర‌స‌న క‌నిపించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ‌నే మిగిల్చింది. ఇక ఆ త‌రువాత తెలుగు సినిమాల మార్కెట్ పెర‌గ‌డం, అందుకు చిరు మాస్‌ ఇమేజ్ కూడా కార‌ణం కావ‌డంతో ఇత‌ర భాష‌ల‌వైపు మెగాస్టార్ దృష్టి సారించ‌లేదు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ద్వారా చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేయ‌బోతుండ‌టం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: