తెలుగు సినీ రంగంలో పద్మశ్రీ అందుకున్న తొలి తెలుగు హాస్య నటుడు రేలంగి. భక్త ప్రహ్లాద సినిమా చూసి ఎలాగైనా సరే సినిమాల్లోకి రావాలి అనుకొని ఎంతో కష్టపడి సక్సెస్ను అందుకున్న గొప్ప హాస్య నటుడు, గాయకుడు, నిర్మాత రేలంగి వెంకట్రామయ్య గారు. తెలుగు సినిమా చరిత్రలో గొప్ప హాస్యనటుడు ఎవరు అనగానే మొట్టమొదటి సారిగా వినిపించే పేరు రేలంగి గారే. నవ్వుల నవాబు రాజబాబు ని  తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. సినీ దర్శకులు సి.పుల్లయ్య గారి దర్శకత్వం వహిస్తున్న శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో ఒక పాత్ర పోషించి దానిద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా ఆశించిన ఫలితం అయితే రాలేదు. గుణసుందరి కథ అనే సినిమాతో ఆయనకు ఊహించనంతగా పేరు వచ్చింది.

ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. వరుస సినిమాలు రావడంతో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు రేలంగి గారు. అప్పట్లో ఒక సినిమా వస్తుంది అంటే దాంట్లో కచ్చితంగా రేలంగి మామ ఉంటాడు.. ఆ సినిమాకి వెళ్ళాలి అనేలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు రేలంగి గారు. గిరిజ, సూర్యకాంతం తో రేలంగి గారి కాంబినేషన్ అంటే చెప్పాల్సిన పని లేదు. ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవారు. ఒకపక్క హాస్యనటుడిగా రాణిస్తూనే, మరోపక్క ఎన్నో పాటలు పాడాడు. సరదా సరదా సిగరెట్టు.. అనే పాట ఇప్పటికీ ఎంతో ఉత్సాహాన్ని,సంతోషాన్ని ఇస్తుంది. ఆ పాటతో పాటు మిస్సమ్మ చిత్రంలో కూడా ఒక పాట పాడి ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. కేవలం హాస్యనటుడిగా, గాయకుడు గానే కాదు, నిర్మాతగా కూడా సామ్రాజ్యం అనే చిత్రాన్ని  నిర్మించాడు. ఈ సినిమాతోనే నవ్వుల నవాబు రాజబాబు గారు రంగ ప్రవేశం చేశారు. రేలంగి గారిది మంచి మనసు ఎన్నో కాలేజీలకు విరాళాలు ఇచ్చారు.

 ఎంతో మంది వివాహాలకు సహాయం చేశారు. ఎన్నో గుప్తదానాలు, అన్నదానాలు చేశారు. ప్రభుత్వం ఆయన హాస్య నటనను గుర్తించి పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది. తెలుగు సినీ చరిత్రలో పద్మశ్రీ అవార్డు పొందిన తొలి తెలుగు హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య గారు. తన 40 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి,సినీ ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించిన గొప్ప హాస్యనటుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: