నటీనటులు: అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్), సిద్ధికా శర్మ, సాయికుమార్, ఇంద్రజ, సీత, సిజ్జు, మధు నందన్, గగన్ విహారి తదితరులు
ప్రియ (సిద్దికా శర్మ) వైజాగ్‌లో మెడిసిన్ స్టూడెంట్. ప్రియను ఇష్టపడే అభిరామ్ (అమన్) ఆమె కోసం అదే కాలేజీలో మెడిసిన్ స్టూడెంట్‌గా చేరుతాడు. తొలుత అభిరామ్ అంటే ప్రియకు అసహ్యం. అయితే కొన్ని కారణాల వల్ల ప్రియ, అభిరామ్ దగ్గరవుతారు. కానీ ప్రేమను వ్యక్తపరుచుకోరు. అయితే అభిరామ్ ప్రేమ వ్యవహరం తెలిసిన తండ్రి ధనుంజయ్ (సాయికుమార్) తన కొడుకు హెచ్చరిస్తాడు. ప్రియురాలిని వదిలేసి రమ్మని వార్నింగ్ ఇస్తాడు. అయినా తండ్రి హెచ్చరికలను బేఖాతరు చేసి ప్రియతో ప్రేమ కోసం ఇంటి నుంచి వెళ్లిపోతాడు. దాంతో ప్రియను, అభిరామ్‌ని చంపాలని ధనుంజయ్ ప్లాన్ చేస్తాడు.
అభిరామ్‌ను అసహ్యించుకొనే ప్రియ అతడికి ఎలా దగ్గరైంది. తమ మనసులోని ప్రేమను వారిద్దరు ఎందుకు వ్యక్త పరుచుకోరు. తన కొడుకును, అతడి లవర్‌ను ధనుంజయ్ ఎందుకు చంపాలని అనుకొంటాడు. ఈ కథలో సరోజిని (ఇంద్రజ) ఎవరు? సరోజిని, ధనుంజయ్‌కి సంబంధం ఏమిటి? అభి, ప్రియల ప్రేమకు సరోజిని ఎలా అడ్డంకిగా మారింది. చివరకు అభి, ప్రియల ప్రేమ సుఖాంతం అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే.. నిన్నే పెళ్లాడుతా.
కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో దర్శకుడు వైకుంఠ బోను అల్లుకొన్న ప్రేమకథా చిత్రంలో పలు హిట్ సినిమాల కథలు నిన్నే పెళ్లాడుతా సినిమాకు లింక్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే పలు సినిమాల్లోని బలమైన సన్నివేశాలను ఈ సినిమాకు లింక్ చేసిన విధానంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. సీనియర్ నటులతో నటన రాబట్టుకొన్న తీరు అతడికి సినిమాపై ఉన్న కమాండ్ తెలుస్తుంది. కథ, కథనాలపై మరింత జాగ్రత్త పడి ఉంటే.. మంచి ప్రేమకథా చిత్రమయ్యేదనిపిస్తుంది. సినిమాకు కీలకంగా మారే ఇంద్రజ, సిజ్జు మధ్య సన్నివేశాలపై మరింత ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. సీత, సాయికుమార్‌కు సంబంధించిన సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. సాయికుమార్, సీత, ఇంద్రజ పాత్రలను ఇంకా బలంగా రాసుకొని ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ప్రసాద్ ఈదర, సురేష్ గొంట్ల అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. అనకాల లోకేష్ అందించిన ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది, నవనీత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను ఎలివేట్ చేసింది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ పవర్‌పుల్‌గా ఉన్నాయి. భార్యను ఎత్తికెళ్లిన వాడిన చంపితే రామాయణం, చీర లాగిన వాడిని చంపితే మహాభారతం అంటారు. దేవుడికే కులం మనకేందుకు? కులం ఒక పూట బువ్వ పెట్టలేదు.. ఒక మనిషి ప్రాణం కాపాడలేదు లాంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. నిర్మాతలు బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సమాజంలోని కుల, మతాల విభేదాలపై విమర్శనాస్త్రంగా దర్శకుడు ఈ సినిమాను సంధించాడు. సామాజిక అంశాలతో కూడిన ప్రేమకథలను ఆదరించే వారికి నిన్నే పెళ్లాడుతా నచ్చుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: