కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'ప్రిన్స్' సినిమా ఈనెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు(18-10-22) ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. ''అనుదీప్ తొలుత ఈ కథ వినిపించినప్పుడు, నన్ను తీసుకోవాలని శివకార్తికేయన్ సూచించాడు. కానీ అనుదీప్ అందుకు ఒప్పుకోలేదు. కట్టప్పలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసిన ఆయన, కామెడీ రోల్‌కి అస్సలు సూట్ అవ్వరని రిజెక్ట్ చేశాడు. అప్పుడు శివకార్తికేయన్ తమిళనాడులో సత్యరాజ్ మంచి కామెడీ క్యారెక్టర్ అని, అక్కడ ఆయనకు కామెడీ రోల్స్ చాలా చేశారని చెప్పి రికమెండ్ చేశాడు. ఆ తర్వాతే నన్ను తీసుకోవడానికి అనుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమాషూటింగ్ అయిపోయాక.. సార్ మీరు బాగా చేశారు, ఐయామ్ హ్యాపీ అని అనుదీప్ అన్నాడు'' అని సత్యరాజ్ చెప్పుకొచ్చారు.ఇంకా మాట్లాడుతూ.. తాను పదిహేనేళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తున్నానని, కానీ 'అందరికీ నమస్కారం' తప్పితే ఎక్కువ తెలుగు నేర్చుకోలేకపోయానని సత్యారాజ్ అన్నారు. కానీ.. హీరోయిన్ మరియా మాత్రం తెలుగు చాలా బాగా మాట్లాడుతుందని, ఉక్రెయిన్‌లో తెలుగు మీడియం చదువుకుందని సెటైర్లు వేశారు. అప్పుడు వెంటనే యాంకర్ సుమ అందుకొని, అనుదీప్‌తో సినిమా చేశాక సార్ (సత్యరాజ్) ఇలా మారిపోయారేమోనని డౌట్‌గా ఉందంటూ వెంటనే పంచ్ వేసింది. అది నిజమేనని ధృవీకరిస్తూ.. ఈ సినిమా చేసిన తర్వాత తాను అనుదీప్‌లాగే మారిపోయానని సత్యరాజ్ పేర్కొన్నారు. తెలుగు ఆడియన్స్ ఇంతవరకూ తనని కట్టప్పలాగా, అలాగే తండ్రిపాత్రల్లోనూ చూస్తూ వచ్చారని.. కానీ ఈ సినిమాలో తనలోని కొత్త యాంగిల్‌ని చూస్తారని తెలిపారు. ఇకపై తనకు తెలుగులోనూ కామెడీ క్యారెక్టర్స్‌తో పాటు విలన్ రోల్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తాను చాలా యంగ్‌గా కూడా కనిపిస్తానంటూ చివర్లో చమత్కరించారు. ఇక చివరగా.. ప్రిన్స్ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పి, తన ప్రసంగాన్ని ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: