
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఓజీ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ వీరాభిమాని అయినా సుజీత్ పవన్ కు కచ్చితంగా హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ సైతం ప్రామిసింగ్ గా ఉండటంతో ఓజీ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ భావించారు. మరి ఓజీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ:
1993 సమయంలో ముంబైలోని పోర్టుకు సత్యదాదా (ప్రకాష్ రాజ్) దాదాగా ఉంటారు. ఓజాస్ గంభీర(పవన్ కళ్యాణ్) సత్యదాదాకు అండగా నిలబడి కన్నతండ్రిలా చూసుకుంటూ ఉంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఓజాస్ గంభీర సత్యదాదాకు పది సంవత్సరాల పాటు దూరం కావాల్సి వస్తుంది. ఆ సమయంలో సత్యదాడా శత్రువులు పోర్ట్ పై దృష్టి పెట్టి పోర్ట్ ను ఆక్రమించుకుని ప్రయత్నం చేస్తారు. అయితే సత్యదాదాకు కష్టం వచ్చిందని తెలిసిన తర్వాత ఓజీ ఏం చేశాడు? ఓజీకి జపాన్ లోని సమురాయ్ వంశానికి సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఏ స్థాయిలో వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓజీ సినిమాకు పవన్ వీరాభిమాని అయిన సుజిత్ దర్శకత్వం వహించడం గ్లిమ్ప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటానికి కారణమైంది. సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన సుజీత్ ప్రతి 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ సీన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పవన్ ఫ్యాన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకుని వెళ్లినా ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. ఈ సినిమాలో ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పవన్ ఇమేజ్, స్వాగ్ కు అనుగుణంగా సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ తర్వాత ఆ స్థాయిలో కష్టపడిన వ్యక్తి థమన్ అని చెప్పవచ్చు. తన బీజీఎంతో థమన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో అద్భుతంగా ఉన్నాయి.
ఇంటర్వెల్ సన్నివేశాలు, పోలీస్ స్టేషన్ సీన్లు సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యాయి. జానీ సినిమాను గుర్తు చేసే విధంగా ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాలు ఉండటం గమనార్హం. పవన్ ను సుజీత్ స్టైలిష్ గా చూపించారు.
పవన్ వన్ మెన్ షో అనేలా ఓజీ సినిమా ఉంది. పవన్ తన అద్భుతమైన నటనతో సినిమాను మరో స్టేజ్ కు తీసుకెళ్లారు. ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించింది కొంతసేపే అయినా ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు. పవన్ వేర్వేరు ఆయుధాలతో తెరపై కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించారు. ఇమ్రాన్ హష్మీ ఓమి పాత్రలో విలన్ రోల్ లో అదరగొట్టారు. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, సుదేవ్ నాయర్, అభిమాను సింగ్ ఇతర పాత్రల్లో నటించి సినిమా స్థాయిని పెంచారు.
టెక్నీకల్ గా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో ఉంది. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి . సుజీత్ స్టైలిష్ మేకింగ్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
బలాలు : పవన్ నటన, థమన్ మ్యూజిక్, సుజీత్ స్టైలిష్ మేకింగ్
బలహీనతలు : సెకండాఫ్ లో కొన్ని సీన్స్, స్క్రీన్ ప్లే
రేటింగ్ : 3.25/5.0
బాటమ్ లైన్ : ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో చూసే ఓజీ