ఔను! నిత్యం అంబేడ్క‌ర్ జ‌పం చేస్తూ.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటామ‌ని చెప్పుకొనే టీడీపీ, వైసీపీ కీల‌క నేత‌లు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి ప్ర‌ధాన రోడ్డులో నిలువెత్తు అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి దుండ‌గులు చెప్పుల దండ వేసిన ఘ‌ట‌న‌పై మాత్రం మౌనం పాటించ‌డం సంచ‌ల‌నంగా మారింది. నిజంగానే వీరికి అంబేడ్క‌ర్‌పై ప్రేమ‌, గౌర‌వం ఉన్నాయా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఇరు పార్టీ ల‌నుంచి చోటా నేత‌లు.. ఊరూ పేరు తెలియ‌ని నాయ‌కులు ఒక‌రిద్ద‌రు స్పందించారే త‌ప్ప‌.. కీల‌క నేత‌లు మాత్రం మౌనం పాటించారు.
అయితే.. ఇప్పుడు అంబేడ్క‌ర్‌కు జ‌రిగిన ఈ అవ‌మానం.. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ కో.. లేదా.. వైసీపీ దైవంగాభావించే రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హానికో జ‌రిగి ఉంటే.. ఆయా విగ్ర‌హాల‌కు ఎవ‌రైనా .. చెప్పుల దండ వేసి ఉంటే.. ఇలానే మౌనంగా ఉండేవారా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఎన్టీఆర్‌కు ఈ అవ‌మానం జ‌రిగితే అటు చంద్ర‌బాబుతో మొద‌లు పెట్టి ఎంతో మంది మాజీ మంత్రులు, ఎంపీలు.. ఎమ్మెల్యేలు... ఇటు వైఎస్సార్‌కు ఈ తంతు జ‌రిగితే జ‌గ‌న్ నుంచి ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ఈ ప‌ని పెద్ద కుట్ర అని...దీని వెన‌క ఉన్న వాళ్ల అంతు తేల్చాల‌ని నానా హంగామా చేసేవారు.
ఇక‌, అంబేడ్క‌ర్‌కు జ‌రిగిన అవ‌మానంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రమేష్ స్పందించారు. రాష్ట్రంలో పదే పదే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం దారుణమని మండిపడ్డారు. అంబేడ్క‌ర్ ఏ కులానికో ఏ మతానికో ఏ జాతికో సంబంధం లేకుండా హక్కులకోసం పోరాడి భారత రాజ్యాంగాన్ని రచించార‌ని కొనియాడారు. ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. చింతలపూడి ఘటనలో ఈ దారుణానికి ఒడిగ‌ట్టిన వారిని పోలీసులు ప‌ట్టుకున్నారు. అయితే ప‌లువురు అంబేద్క‌ర్ వాదులు, ఎంఆర్పీఎస్ నాయ‌కులు స్పందించారే త‌ప్పా... నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో భార‌త రాజ్యాంగ నిర్మాత‌కు ఇంత అవ‌మానం జ‌రిగితే స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు... రాష్ట్ర స్థాయిలో ఎస్సీ వ‌ర్గం నేత‌ల్లో కూడా ఒక‌రిద్ద‌రు త‌ప్పా ఎవ్వ‌రూ దీనిపై గొంతెత్తినోళ్లు లేరు.
మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట సమితి ఏలూరు ఇన్చార్జి దేవరపల్లి రత్నబాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి మద్దాల తిరుపతిరావు, కలపాలా పెద్దిరాజు, ఏలూరు వర్కింగ్ అధ్యక్షులు గూడూరు రాజేష్ బాబు తదితరులు భ‌విష్య‌త్తులో ఎవ్వ‌రూ ఇలాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా శిక్ష‌లు ఉండాల‌ని డిమాండ్ చేశారు.

ఇక‌, టీడీపీ ఎస్సీ సెల్ ఎట్ట‌కేల‌కు స్పందించింది.  అంబెడ్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి నిరసనగా దోషులను కఠినంగా శిక్షించాలని నినదిస్తూ, నిరసన చేసిన‌ వారికి సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు, టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్ ఎస్ రాజు , చింతలపూడి తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కొఠారు దొరబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు,  బిసి నాయకులు కొండపల్లి రవి,చింతలపూడి పట్టణ టీడీపీ నేత గొల్లమందల శ్రీనివాస్  త‌దిత‌రులు అక్క‌డ‌కు వ‌చ్చారు. ఏదేమైనా అంబేద్క‌ర్‌కు జ‌రిగిన అవ‌మానం విష‌యంలో మ‌న నేత‌ల నోళ్లు మూగ‌బోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: