
ఇక అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన కూడా చెప్పుకోదగ్గ స్థానాలు సాధించడంతో జనసేన శ్రేణులు సైతం సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ విషయం పక్కనపెడితే బడా నేతలని భావించే కొందరికీ సొంత గ్రామాలలో షాకిచ్చారు అక్కడి ఓటర్లు. మరీ ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలకు కొంత మందికి ఈ షాక్ తగలటం ఆసక్తికరంగా మారింది. ముందుగా కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం ఆలూరు మేజర్ పంచాయతీలో టిడిపి బలపరిచిన అభ్యర్థి విజయం సాదించారు. అలాగే వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆయన సోదరుడు వైసీపీ ఎంపీ స్వగ్రామమైన పెదకాకాని పంచాయతీలో టిడిపి బలపరిచిన అభ్యర్థి 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన అంశం చర్చనీయాంశంగా మారింది.
అలాగే పవన్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత జగన్ కి జై కొట్టిన రాపాక వరప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజోలులో దాదాపు 20కి పైగా గ్రామాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ఇక విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి స్వగ్రామమైన వెన్నెల పాలెం లో గత నలభై సంవత్సరాల నుంచి బండారు సత్యనారాయణమూర్తి చూపించిన అభ్యర్థిని గెలిపిస్తూ వచ్చారు అక్కడి గ్రామస్తులు.
కానీ ఇప్పుడు వైసిపి బలపరిచిన అభ్యర్థి 663 ఓట్లు మెజార్టీతో గెలుపొందిన ఆయనకు షాకింగ్ అంశం అనే చెప్పాలి. ఇక దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్వగ్రామం రాయుడు పాలెంలో కూడా టిడిపి బలపరిచిన అభ్యర్థి విజయం సాదించారు. అలానే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ స్వగ్రామం తిక్కిరెడ్డిపాలెంలో టిడిపి బలపరిచిన అభ్యర్థి గెలుపొందిన ఆశ్చర్యకరంగా మారింది. ఇక మాజీ మంత్రి కే జవహర్ స్వగ్రామంలో వైసిపి గెలుపొందింది.కృష్ణాజిల్లా తిరువూరు మండలం గానుగ పాడు పంచాయతీ సర్పంచిగా వైసీపీ అభ్యర్థి విజయం సాదించారు.