వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఒకటో రోజు, రెండో రోజు.. యాభయ్యో రోజు, 75వ రోజు.. ఇలా కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు ఏం తేలింది అంటే.. పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. దీంతో చివరాఖరుకు సీబీఐ ఓ పత్రికా ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివేకా హత్య కేసులో సరియైన సమాచారం ఇచ్చినవారికి రూ.5లక్షలు బ హుమానం ఇస్తామని సీబీఐ పేర్కొంది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది. సాధారణ ప్రజలనుంచి కూడా ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చని సూచించింది. ఎస్పీ, డీఎస్పీలకు వివరాలు తెలియజేయాలంటూ వారి ఫోన్ నెంబర్లను కూడా పేపర్ ప్రకటనలో ఇచ్చింది.


ఇప్పటి వరకూ జరిగింది ఏంటి..?
2019 మార్చి 15 అర్థరాత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ కేసులో ఏపీ పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది. వివేకా కుమార్తె అభ్యర్థనతో హైకోర్టు ఉత్తర్వులతో ఆ తర్వాత కేసు సీబీఐకి బదిలీ అయింది. 2020 జూన్ 9న ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ.. కరోనా కారణంగా కొన్నాళ్లు ఏపీకి నేరుగా వచ్చి విచారణ చేపట్టలేదు. ఇటీవల ఏపీకి వచ్చి అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇప్పటి వరకు సునీల్ కుమార్ యాదవ్ అనే పేరు మాత్రమే ప్రముఖంగా వినిపించింది. అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలకోసం కూడా గాలించారు. కానీ ఇంకా ఏమీ తేలలేదు.

ఇటీవల వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిపించడంతో కలకలం రేగింది. అటు కడప సెంట్రల్ జైలులో కూడా మరికొందరిని సీబీఐ అధికారులు విచారణకు పిలిపించారు. కానీ ఎవరి దగ్గరనుంచి సరైన సమాచారం రాబట్టలేకపోయారు. ఇప్పటి వరకు కేసు విచారణలో పురోగతి కనిపించి ఉంటే కచ్చితంగా దాన్ని కోర్టుకి సమర్పించేవారు. కానీ సీబీఐ ఎంక్వయిరీలో ఎలాంటి పురోగతి లేదని తెలుస్తోంది. దీంతో చివరిగా వారు పత్రికా ప్రకటన ఇచ్చారు. సమాచారం ఇచ్చినవారికి 5లక్షల రూపాయల నజరానా ప్రకటించారు.

మాజీ సీఎంకు స్వయానా తమ్ముడు, ప్రస్తుత సీఎంకు స్వయానా బాబాయ్.. అలాంటి వ్యక్తి హత్యకు గురైతే ఇంతవరకు కనీసం నిందితుల ఆచూకీ తెలియలేదు. హత్య జరిగి రెండేళ్లు దాటిపోయినా ఫలితం లేదు. చివరకు సీబీఐ కూడా ఈ కేసులో ఏమీ చేయలేక నిందితుడి ఆచూకీ చెబితే 5లక్షలంటూ పేపర్ ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి. ఇదీ వైఎస్ వివేకా హత్య కేసు పురోగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: