పెళ్లంటే నూరేళ్ల పంట.. ఈ సామెత ఒకప్పటిది.. ఇప్పుడు అలా కాదు.. పెళ్లయినా జీవిత భాగస్వామి  తీరు నచ్చకపోతే.. మూడు నెలలకే విడాకుల కోసం దరఖాస్తు చేసేస్తున్నారు. ప్రేమలకే కాదు.. పెళ్లిళ్లకూ బ్రేకప్ చెప్పేస్తున్నారు. అయితే.. ఈ విడాకులకు కారణాలు ఏంటి.. అంటే.. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా.. విడాకులకూ అనేక కారణాలు ఉంటున్నాయి. అభిప్రాయాలు కలవకపోవడం.. ఒకరికొకరికి పొసగకపోవడం.. ఆశించిన రీతిలో వైవాహిక జీవితం సాగక పోవడం ఇలా ఎన్నో కారణాలు..  భార్యాభర్తా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న రోజుల్లో ఎవరూ రాజీ పడే పరిస్థితులు కనిపించడం లేదు.


సరే.. ఇలాంటివన్నీ సాధారణమే.. కానీ.. ముంబయిలో మాత్రం ఓ వింత కారణంతో విడాకులు తీసుకుంటున్నారట. వంద విడాకుల కేసుల్లో 3 కేసులు ఈ కారణంతో విడాకులు జరుగుతున్నాయట. మరి ఆ వింత కారణం ఏంటో తెలుసా.. ట్రాఫిక్‌ సమస్య.. అవును.. నిజమే.. ట్రాఫిక్ సమస్య కారణంగా ముంబయిలో మూడు శాతం విడాకుల కేసులు ట్రాఫిక్ సమస్య వల్లే వస్తున్నాయట. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ భార్య.


ఈ మాట ఓ మాజీ సీఎం భార్యగా కాకుండా.. ఓ సగటు ముంబయివాసిగా చెబుతున్నానంటోంది దేవేద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్. ఇప్పుడు ఈమె  చేసిన వ్యాఖ్యలతో మరాఠా రాజకీయాలు వేడెక్కాయి. ముంబయి రోడ్ల తీరును తప్పుపట్టి అమృత.. అక్కడి శివసేన సర్కార్‌ను  టార్గెట్ చేశారు. ముంబయిలో ట్రాఫిక్ కారణంగా ప్రజలు తమ కుటుంబాలకు సమయం ఇవ్వలేకపోతున్నారని ఆమె అంటున్నారు. అందుకే ముంబయిలో మూడు శాతం జంటలు విడాకులు తీసుకోవడానికి ట్రాఫిక్ కారణమంటున్నారు.


ముంబయిలో ఒక్కసారి ఇంటి నుంచి బయటికి వెళితే అన్నీ గుంతలే కనిపిస్తున్నాయన్నారు. ఈ గుంతల రోడ్లపై ట్రాఫిక్ దారుణంగా ఉందని.. అందుకే ముంబయిలో జంటలు విడాకులకు దరఖాస్తులు చేస్తున్నారని అమృత అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: