తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు చేస్తున్న ప్రకటనలు తెలంగాణలో ఆయన ఇమేజ్ ను ఏమాత్రం పెంచాయో  తెలియదు గాని ఏపీలో మాత్రం ఆయనను హీరోను చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు, విభజన తర్వాత కొంతకాలం ఆయన్ను ఒక నెగిటివ్ యాంగిల్లో చూసినా ఏపీ జనాలు తర్వాత మాత్రం ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని తెగ నచ్చేస్తున్నాయి. తాజాగా నిరుద్యోగులకు ఒకే విడతలో 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడంతో పాటు 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని అనడంతో తెలంగాణ నిరుద్యోగుల్లో అధికభాగం ప్రజలు ఆయనకు జై కొడుతున్నారు.

విచిత్రంగా విపక్షం లోని జగ్గారెడ్డి లాంటి పలువురు నేతలు బహిరంగంగానే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే తెలంగాణలో ఈ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఏపీ లోని ఉద్యోగ సంఘాలు సైతం తెలంగాణ సీఎం కేసీఆర్ ని హీరో లాగా చూడటం విశేషం. రాష్ట్ర విభజన జరిగి కొత్తగా తెలంగాణ ఏర్పడినప్పుడు ఉద్యోగులు ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ 43 శాతం పిఆర్సి ప్రకటించారు. దాంతో ఏపీలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు దానితో సమానంగా పిఆర్సిని ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుమతించకపోయినా సరే పిఆర్సి తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే ఇచ్చి తీరాల్సి వచ్చిందని టిడిపి ప్రభుత్వం తెలిపింది. మొన్నటి పిఆర్సి విషయంలోనూ కెసిఆర్ ఉద్యోగులను డీల్ చేసిన విధానం ఏపీలోనూ తాజాగా చర్చనీయాంశమైంది. ఐఆర్ ఇవ్వక పోయినా సరే వారిలో పెద్దగా అసంతృప్తి రేగకుండా పూర్తిగా విషయాన్ని డీల్ చేసిన కేసీఆర్ తో జగన్ ను పోలుస్తున్నారు. ఎన్నికల్లో గెలవగానే 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. కానీ పిఆర్సి విషయంలో ఉద్యోగులతో పలు వివాదాలు తెచ్చుకొని ఉద్యమం చేసేదాకా ఏపీ సర్కార్ తీసుకెళ్ళింది.

తెలంగాణ లో పెద్ద సినిమాల విషయంలో టికెట్ రేట్లు పెంచుకునేలా కేసీఆర్ అనుమతి ఇవ్వడంతో ఇటీవల భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఏకంగా విజయవాడలోనే హాట్సాఫ్ కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు పెట్టడం సంచలనంగా మారింది. ఇవన్నీ ఏదో ఒక విధంగా ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అంశాలే. అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలు చేపడుతున్న ప్రజల్లో అసంతృప్తి మాత్రం పెరుగుతూనే ఉంది. ఇవన్నీ గమనిస్తున్న విశ్లేషకులు జనాన్ని ఆకట్టుకోవడంలో కేసీఆర్ స్టైలే వేరని.. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసని అంటున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాధినేతలు కెసిఆర్ ని చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉందనేది వారి మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: