వైసీపీ నేతలు మరోసారి పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇటీవల కాలంలో దత్త పుత్రుడు అని పదే పదే పవన్ ని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. ఆ విమర్శలను జనసైనికులు కూడా తిప్పికొడుతున్నారు. పవన్ ని చంద్రబాబు దత్తపుత్రుడు అంటే.. వారి నాయకుడిని సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని అన్నారు, అనేశారు కూడా. కానీ ఆ విమర్శలు, ప్రతి విమర్శలు మాత్రం ఆగలేదు. కానీ ఇప్పుడు పేర్ని నాని.. పవన్ కల్యాణ్ కు ఓ సవాల్ విసిరారు. పవన్ నిజంగానే బాబు దత్త పుత్రుడు అనిపించుకోకూడదు అంటే.. ఆయన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్నారు.

ప్రకాశం జిల్లా పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు నాని. గతంలో పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ ప్రభుత్వం, వారి పాలనలో రైతులను దగా చేసిందని, అది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఏపీలో రైతులు పడుతున్నఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం కారణం కాదా అని అడిగారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నాని నిలదీశారు.

వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తమ పార్టీని విమర్శించడమే పవన్ కల్యాణ్ కి తెలుసన్నారు నాని. పవన్ కళ్యాణ్ పార్టనర్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా కౌలు రైతులకు ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టింది, ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చిందని ప్రశ్నించారు నాని. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి, బీజేపీతో ఫైట్ చేసి.. దేశవ్యాప్తంగా కౌలు రైతుల కోసం చట్టం చేయించాలని సూచించారు నాని. చంద్రబాబు దత్త పుత్రుడు కాకపోతే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలని పేర్ని నాని సవాల్ విసిరారు.

అయ్యన్న ఎపిసోడ్ పై..
పేర్ని నాని అయ్యన్న ఎపిసోడ్ పై కూడా స్పందించారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన అయ్యన్న, రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు నాని. ఇది కొత్త సిద్ధాంతంగా ఉందని చెప్పారు. నిజమైన బీసీలెవరూ ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కబ్జా చేయరని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: