వైసీపీలో సస్పెండ్ అయిన ఎంఎల్ఏలు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి నలుగురు ఎంఎల్ఏలను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వేటుపడిన దగ్గరనుండి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు నలుగురు ఎంఎల్ఏలు భేటి అయినట్లు లేరు. ఎవరికి వాళ్ళుగానే మీడియా సమావేశాలు పెడుతున్నారు, ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారు.





ఎవరెలా మాట్లాడినా, ఎన్ని ఆరోపణలుచేసినా టార్గెట్ మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే సజ్జల అయినా మరో నేతైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్ళే. జగన్ కు ఇష్టంలేకపోతే ఎవరు చెప్పినా వినరు, ఎవరికి  కూడా జగన్ కు చెప్పేంత సీన్ లేదని అందరికీ తెలుసు. ఏ విషయంలో అయినా సరే తనకున్న మార్గాల్లో జగన్  రిపోర్టులు తెప్పించుకుంటారు.





ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్ అయినా మరో పార్టీ అధినేత అయినా థిక్కారాన్ని సహించరు. కాకపోతే తిరుగుబాటు చేసిన వారిపై యాక్షన్ తీసుకోవటంలో ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైలంతే. చంద్రబాబునాయుడు ఎప్పటికీ ఎవరిమీదా యాక్షన్ తీసుకోలేరు. ఊరికే బెదిరిస్తు వాళ్ళని అదుపులో పెట్టుకోవాలని చూస్తుంటారు. జగన్ అలాకాదు తేడా వచ్చిందని అనుకుంటే వెంటనే వేటు వేసేస్తారు. ఇపుడు అలా వేటుపడిన నలుగురు కూడా సజ్జలనే టార్గెట్ చేస్తున్నారు.




తమపై సస్పెన్షన్ వేటుకు సజ్జలే కారణమన్నట్లుగా రెచ్చిపోతున్నారు. క్రాస్ ఓటింగ్ తో వైసీపీ అభ్యర్ధి ఓడిపోవటంలో ఏమి జరిగుంటుందనే విషయాన్ని జగన్ ముఖ్యులతో చర్చించారు. ఆ తర్వాతే యాక్షన్ తీసుకున్నారు. ఆనం, కోటంరెడ్డి పార్టీపైన తిరుగుబాటు చేశారు. వీళ్ళపై యాక్షన్ తీసుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇపుడు క్రాస్ ఓటింగ్ అనే రూపంలో అవకాశం రాగానే వేటు వేశారంతే. మొత్తానికి సజ్జలే పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా పాపాల భైరవుడు అయిపోతున్నట్లున్నారు. ముందుముందు ఇంకెంతమంది ఎన్నిరకాలుగా సజ్జలను టార్గెట్ చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: