టీడీపీ అంటే బీసీల పార్టీ అని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. అందులో కొంత వాస్తవమూ ఉంది. ఎన్టీఆర్ హయాంలో బీసీ కులాలను బాగా ప్రోత్సహించారు. బీసీ కులాలను టీడీపీ ఓటు బ్యాంకుగా ఎన్టీఆర్ మార్చారు. అయితే ఆ ఓటు బ్యాంకును చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారన్న విమర్శ ఉంది. ఇప్పుడు వైసీపీ సోషల్ ఇంజినీరింగ్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో వెళ్తోంది. అందుకే ఇప్పటికీ కాస్తో కూస్తో టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను తనవైపు పూర్తిగా తిప్పుకుంటోంది.

అందులో భాగంగానే.. జగన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీ కులాల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 139 బీసీ కులాలకు వెనుకబడిన తరగతుల శాఖ కొత్తగా 56 బీసీ కార్పొరేషన్లును ఏర్పాటు చేసింది.  పది లక్షలకు పైన జనాభా ఉన్న  కార్పొరేషన్‌లను  ‘ఏ’ కేటగిరీ కింద, లక్ష నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘బి’ కేటగిరీ కింద, లక్షలోపు జనాభా ఉన్న కార్పొరేషన్‌లను ‘సి’ కేటగిరీ కింద విభజించింది.


ఈ కార్పొరేషన్‌లకు ఈ నెల 18న కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టనుంది. వెనుకబడిన కులాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వేగంగా లబ్దిదారులకు అందేలా ఈ కార్పొరేషన్లు  ఏర్పాటు చేశారు జగన్. 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఈ 56 కార్పోరేషన్లు పనిచేస్తాయంటున్నారు.  జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రతి కార్పొరేషన్‌లోనూ 13 మంది డైరెక్టర్లను నియమించాలన్నది జగన్ యాక్షన్ ప్లాన్.  కొత్తగా ఏర్పాటు చేసిన 56 బీసీ కులాల కార్పొరేషన్ల పరిధిలో మిగతా ఉపకులాలకూ ప్రాతినిధ్యం వస్తుంది.  ఏపీ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం 2001 ప్రకారం బీసీ కులాల కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం  వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: