టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు.. అచ్చెన్నాయుడు గురించి తెలిసిన వారు ఒక మాట చెబుతుంటారు. అదేంటం టే.. ఆయ‌న‌కు ఆవేశం ఎక్కువ‌ని! నిజ‌మే.. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఆవేశం ఉండి తీరాల్సిందే. అయితే.. ఆ ఆవేశానికి కూడా అంతో ఇంతో ఆలోచ‌న జోడించాలి. కానీ, ఈ విష‌యంలోనే అచ్చెన్న డింకీలు తింటున్నారు. తాజాగా ఆయ‌న ఓ లేఖ రాశారు. అది కూడా రైతుల‌కు మ‌ద్ద‌తుగా త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని.. పేర్కొన్నారు. ఈ నెల 27న త‌ల‌పెట్టిన భార‌త్ బంద్‌కు టీడీపీ సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తుంద‌ని పేర్కొన్నారు.,

అయితే.. భార‌త్ బంద్ ఎందుకు జ‌రుగుతోందో ఆయ‌న‌కు తెలుసు. కేవ‌లం కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్షాలు, రైతులు.. చేస్తున్న ఉద్య‌మంలో భాగంగానే భార‌త్ బంద్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ బంద్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఎలాంటి సంబంధం లేద‌ని.. రైతు నేత‌లు.. స‌హా.. బంద్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న‌.. పార్టీలు కూడా స్ప‌ష్టం చేశాయి. అంతేకాదు.. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల‌ను కూడా ఈ బంద్‌కు మద్ద‌తివ్వాల‌ని.. అభ్య‌ర్థించారు. దీనికి సంబంధించి రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ ఆలోచిస్తోంది కూడా.

అయితే.. ఇంత‌లోనే.. అచ్చెన్న రాసిన ఉత్త‌రం.. విమ‌ర్శల‌కు తావిస్తోంది.  రైతు ప్రయోజనాలకు టీడీపీ కట్టుబడి వుంద‌ని పేర్కొన్న ఆయ‌న అస‌లు బంద్ ప్రాధాన్యాన్ని ప‌క్క‌న పెట్టి.. రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న‌ను విమ‌ర్శించ‌డం ప్రారంభించారు.  రాష్ట్రంలో వైసీపీ రైతు వ్యతిరేక పార్టీగా మిగిలిపోయింద‌న్నారు. రైతులను కూలీలుగా మార్చిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమ‌ని మండిప‌డ్డారు. అప్పుల కోసం మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు మెడకు ఉరితాడు బిగిస్తున్నారన్నారు. డ్రిప్ ను రద్దు చేయడంతో మెట్టప్రాంత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 రైతు భరోసా రూ.12,500వేలు ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. రూ.50 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీ మర్చిపోయారా..? అని ప్ర‌శ్నించారు. ఉచిత బోర్లు వేస్తామని ప్రచారం చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. 28 నెలలుగా ఒక్కబోరు కూడా వేయలేదన్నారు. రైతులకు మద్ధతు ధర లేక పంటలను నేలపైనే పడబోస్తున్నార‌ని చెప్పారు. రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేస్తామన్న ధరల స్థిరీకరణ ఏమైంద‌ని నిల‌దీశారు.,  జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే రైతులతో సమావేశం కావాల‌ని స‌వాల్ విసిరారు.  ఇంత వ‌ర‌కుబాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అస‌లు బంద్ ఉద్దేశాన్ని.. రైతుల విజ్ఞ‌ప్తిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా.. పాడిందే పాట‌.. అన్న‌ట్టుగా అచ్చెన్న జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌డంపై రైతు సంఘాల నాయ‌కులు నోరెళ్ల బెడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: