
వైసీపీ ని తమ సొంత ప్రయోజనాల కోసం ఆ పార్టీ నాయకులు సర్వ నాశనం చేస్తున్నారు. ఇలాంటి నేతలే వైసిపిలో ఎక్కువగా ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో చాలామంది నాయకులు తమకు గిట్టని వాళ్లను ఏదోలా పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టే వరకు నిద్రపోవడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఇదే పనిలో చాలామంది ఎమ్మెల్యేలు , మంత్రులు ఉన్నారు. అందుకే ఎన్నికల్లో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేలు , కొందరు రీజనల్ కో ఆర్డినేటర్లలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఎవరికి వారు తమ వ్యక్తిగత స్వార్థం కోసం కొందరు నాయకులతో గొడవలు పెట్టుకుని వారిని పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేస్తున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ - సింగనమల - కదిరి తదితర నియోజకవర్గాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
కొంతమంది స్వార్థానికి పార్టీ నుంచి బలమైన నాయకులను బయటకు పంపేశారు. నరసరావుపేట - ఒంగోలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు - మాగుంట శ్రీనివాసులురెడ్డి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర ఆర్థిక సంపన్నులైన నాయకులు జగన్తో విభేదాలు వచ్చి బయటకు వెళ్లలేదు. సొంత పార్టీలో కొందరు పనిగట్టుకుని వారికి పొగ పెట్టడం వల్ల బయటకు వెళ్లాల్సిన దుస్థితి. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. భవిష్యత్తులోనూ ఇలాంటివి మరిన్ని జరిగే అవకాశం లేదు. నాటి తప్పుల నుంచి జగన్ గుణపాఠం నేర్చుకుని అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు పార్టీలో కిందిస్థాయి నేతలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే పరిస్థితి కల్పించాలి. లేకపోతే పార్టీ నుంచి తనకు గిట్టని నాయకులను జగన్తో సంబంధం లేకుండా బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. జగన్ ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోతే వైసిపి మరింత ఘోరంగా దెబ్బ తినటం ఖాయం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు