
ఈ వీడియో ఇప్పటికే నాలుగు రోజులుగా వైరల్ అవుతున్నా దీనిపై జనసేన గాని, టిడిపి గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ రాయలసీమ రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ విషయంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా ఈ అంశంపై మీడియా సమావేశాలు పెట్టాలని యోచించినప్పటికీ, పార్టీ అధినేత జగన్ నుంచి “జనసేన వ్యవహారాల్లో ఎవరూ మాట్లాడవద్దు, దూరంగా ఉండాలి” అనే ఆదేశాలు రావడంతో అందరూ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
ఇక కురుపాం నియోజకవర్గంలో జరిగిన మరో ఘటన కూడా పెద్ద కలకలం రేపింది. అక్కడ జనసేనకు చెందిన ఎంపీపీపై టిడిపి నాయకులే బహిరంగంగా దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో ఆ ఎంపీపీ గాయపడి, తర్వాత వారే హాస్పిటల్‌లో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన రెండు పార్టీల మధ్య అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. దీనిపై కూడా వైసీపీ నేతలు వ్యాఖ్యానించాలని ప్రయత్నించగా, జగన్ మరోసారి వారిని ఆపినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
రాజకీయ వర్గాల చర్చల ప్రకారం, ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కేంద్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణల దృష్ట్యా వైసీపీ ఎలాంటి వివాదాల్లోనూ పడకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. జగన్ లక్ష్యం ఇప్పుడు పార్టీని అనవసర వివాదాల్లోకి వెళ్లకుండా చూడాలని... న్యూట్రల్ జనాల్లో రాంగ్ సిగ్నల్స్ వెళ్లకుండా చూడాల్సి ఉందని అంటున్నారు. అయితే జగన్ పాటించే ఈ మౌనం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.