హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్ల వ‌ద్ద‌ భారీ మార్పులు చేస్తున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వివ‌రించారు.  పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలను విధించ‌నున్నారు.  హైద‌రాబాద్ న‌గ‌రం రోజు రోజుకు అభివృద్ధి  చెందుతున్న తరుణంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే  చర్యలను తీసుకుంటున్నారు. ఈ త‌రుణంలోనే  రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను పెట్టే యోచన చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, లంగర్‌హౌజ్, నానల్ నగర్, రవీంద్రభారతి, కంట్రోల్‌ రూమ్‌తో పాటు పలు జంక్షన్లలో మార్పులు చేయనున్నట్టు రంగనాథ్  వివ‌రించారు.

మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వాహనాలన్నింటినీ నేరుగా  పంజాగుట్టకు అనుమతి ఇచ్చే అవకాశముంది. అదేవిధంగా ఫిల్మ్‌నగర్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలన్నింటినీ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫ్రీ లెప్ట్ ఇచ్చి మ‌ళ్లించ‌నున్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయిన‌ది ఫ్రీలెప్ట్ విధానం. ఆర్టీసీ క్రాస్ రోడ్డు జంక్షన్ల మాదిరిగానే అన్నింటినీ తయారు చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు రంగనాథ్. వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నట్టు గుర్తించామని, రద్దీగా ఉండే జంక్షన్ల మార్పులపై ప్రణాళికలు సిద్ధం చేసామ‌ని  పేర్కొన్నారు. వారం రోజుల్లో రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తామని  ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: