సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటించారు చంద్రబాబు. ఇక ఆయన మ్యానిఫెస్టో ప్రకటించిన అప్పటి నుంచి ఇవి అమలు అవుతాయా? అనే సందేహం అందరిలో నెలకొంది. ఇక ఏపీ వ్యాప్తంగా దీని సాధ్యాసాధ్యాలపై లెక్కలు వేసుకుంటున్నారు. మరికొంత మంది వైసీపీ మ్యానిఫెస్టో బావుందా.. లేక టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు తమకు మేలు చేస్తాయా అనే లెక్కల్లో పడ్డారు.


వాస్తవానికి సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలకే ఏటా రూ. డెబ్బై వేల కోట్లు బడ్జెట్ అవసరమవుతుంది. కానీ ఇప్పుడు టీడీపీ మ్యానిఫెస్టో అమలు చేయాలంటే దీనికి రెట్టింపు అవుతుందని వైసీపీ ప్రచారం చేస్తోంది. సుమారు 1.50లక్షల కోట్లు అవసరం అవుతాయని లెక్కలు కట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ మ్యానిఫెస్టోకి బీజేపీ మద్దతు ఉందా లేదా అనేది అర్థం కానీ పరిస్థితి. ఎందుకంటే అవునన్నా.. కాదన్నా రాష్ట్రానికి నిధులు ఇచ్చేది కేంద్రమే కాబట్టి.


అయితే ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఈ అంశాలపై స్పష్టత ఇస్తారు అని అంతా భావించారు. కానీ ప్రధాని చాలా వ్యూహాత్మకంగా పలు అంశాలను టచ్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అందులో ముఖ్యమైనది సూపర్ సిక్స్ పథకాలు. రెండోది అమరావతి రాజధాని, మూడోది విశాఖ స్టీల్ ప్లాంట్. కానీ వీటి గురించి ఎక్కడా మోదీ మాట్లాడటం లేదు.


టీడీపీ, జనసేన కూటమి తమ మ్యానిఫెస్టో ప్రకటించే సమయంలో బీజేపీ కానీ.. మోదీ ఫొటో కానీ ఎక్కడా లేదు. కానీ కేంద్ర సాయంతో ఈ మ్యానిఫెస్టోని అమలు చేసి తీరుతాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ మోదీ  ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడిందే లేదు. అధికారంలోకి వస్తే కేంద్రం ఈ పథకాలకు సాయం అందిస్తుంది అని ఎక్కడా ప్రకటించడం లేదు. దీంతో ఏపీ ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ప్రధాని విమర్శలకే పరిమితం అవుతున్నారు తప్ప పరిష్కారాలు చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఉచితాలకు వ్యతిరేకం అని గుర్తు చేస్తున్నారు.  మరోవైపు ఈ గ్యారంటీలకు మోదీ గ్యారంటీ ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: