జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కి చేరుకోగానే రాజకీయంగా ఒకటే హడావుడి మొదలైపోయింది.  ప్రధానమంత్రితో భేటి సందర్భంగా జగన్ ఎన్డీఏలో  చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తారంటూ సోషల్ మీడియాలో ఒకటే హోరెత్తిపోతోంది. ఒక క్యాబినెట్ మంత్రితో పాటు  స్వతంత్రహోదాలో రెండు మంత్రిపదవులు ఖాయమని ఓ ప్రచారం జరుగుతోంది. అలాగే రెండు క్యాబినెట్ మంత్రిపదవులతో పాటు స్వతంత్రహోదాలో మరో సహాయ మంత్రిపదవి ఖాయమైపోయిందనేది ఇంకో ప్రచారం. జరుగుతున్న ప్రచారాన్ని చూస్తే  వైసిపి ఎన్డీఏలో చేరటం ఖాయమైపోయిందా అన్నంతగా ఉంది హడావుడి.  ఇదే సమయంలో  ప్రధానితో జగన్ భేటి తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు గ్యారెంటి అంటూ ప్రచారం ఒక్కసారిగా జోరందుకుంది.



సరే జరుగుతున్న ప్రచారమే నిజమని కాసేపు అనుకుంటే ఎన్డీఏలో జగన్ చేరటం వల్ల లాభం ఎవరికి ?  నష్టం ఎవరికి ? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ విషయాలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఎన్డీఏలో చేరాలని జగన్ అనుకుంటే ముందుగా కొన్ని డిమాండ్లు చేయటం మాత్రం ఖాయం. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, పోలవరం ప్రాజెక్టుతో  పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, క్లియర్ కావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై ప్రధానితో జగన్ స్పష్టంగా మాట్లాడే అవకాశాలున్నాయి. కేవలం హామీలు ఇవ్వటమే కాకుండా తక్షణమే అమల్లోకి తేవాలని జగన్ పట్టుబట్టే అవకాశం ఉంది.  దీనికి ప్రధాని గనుక సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి ఎంతో ఉపయోగం జరుగుతుందనటంలో సందేహం లేదు.




ఇక రాజకీయంగా చూస్తే  అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్ పై సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయస్ధానం జోక్యాన్ని నిలువరించటం లాంటి అనేక అంశాలపై జగన్ కు హామీ రావాల్సుంటుంది. మోడి గనుక సానుకూలంగా స్పందిస్తే ఎన్డీఏలో చేరటం వల్ల జగన్ కు రాజకీయంగా లాభం ఉంటుంది. అంటే రాష్ట్రప్రయోజనాలే కాకుండా రాజకీయంగా కూడా ప్రత్యర్ధులపై పై చేయి సాధించే అవకాశం ఉంటేనే జగన్ ఎన్డీఏలో చేరచ్చు  లేకపోతే అవసరమే లేదు.   చంద్రబాబునాయుడు ఎన్డీఏలో ఉన్నంత కాలం జగన్ను ఇబ్బంది పెట్టటానికి చాలానే ప్రయత్నాలు చేశాడు. అయితే చాలా ప్రయత్నాల్లో ఫెయిలయ్యాడు.




ఇక మరో కీలక పరిణామం ఏమిటంటే జగన్ గనుక ఎన్డీఏలో చేరితే  చంద్రబాబు-పవన్ కల్యాణ్ కు పెద్ద దెబ్బనే చెప్పాలి.  ఎందుకంటే వైసిపి, బిజేపీలకు చంద్రబాబు ప్రదాన ప్రత్యర్ధి అన్న విషయం అందరికీ తెలిసిందే.  కాబట్టి టీడీపీని నేలమట్టం చేయటమే ధ్యేయంగా చూస్తే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలవ్వటం ఖాయం. ఇక  జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజేపీ మిత్రపక్షం. ఎన్డీఏలో వైసిపి చేరితే జగన్ కు వ్యతిరేకంగా పవన్ నోరెత్తేందుకు లేదు. కాకపోతే బీజేపికి మిత్రపక్షంగా ఉండాలా ? వెళ్ళిపోవాలా ? అన్నది పవనే నిర్ణయించుకోవాలి. ఇదే సమయంలో  వైసిపి ప్రభుత్వంపై  బీజేపీ నేతలు కూడా నోరెత్తే అవకాశం ఉండదు. అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలన్నమాట. చూద్దాం జగన్ పర్యటనలో ఏమి తేలుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: