ఆంధ్రప్రదేశ్‌లో అమ్మే మద్యంలో విష పదార్ధాలు ఉన్నాయా.. అవి తాగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారా... ప్రాణాలు కోల్పోతున్నారా.. అంటే అవునంటోంది ప్రతిపక్ష టీడీపీ. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. సొంత బ్రాండ్లతో జగన్ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి రాగానే.. మద్యం బ్రాండ్లు మార్చి వేశారని..తనకు అనుకూలమైన వారికి కాంట్రాక్టులు ఇచ్చారని.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పది, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలై 19 మంది విద్యార్థులు చనిపోవటం దారుణం అన్న చంద్రబాబు.. ఈ పాపం వైకాపా ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. అలాగే దుల్హన్ పథకం కింద పేద ముస్లిం మైనార్టీ యువతులకు తెలుగుదేశం ఇచ్చిన రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచుతానని హామీ ఇచ్చి జగన్ రెడ్డి విస్మరించారని చంద్రబాబు మండిపడ్డారు.


నిధుల్లేక దుల్హన్ పథకాన్ని నిలిపివేశామని హైకోర్టులో చెప్పడం జగన్ రెడ్డి మోసానికి నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ముస్లిం యువతులకు ఇచ్చే సాయాన్ని ఎత్తివేయడమే గొప్ప సంక్షేమమా అని చంద్రబాబు నిలదీశారు. పంటల బీమా సాయంలో అసలైన రైతులకు లబ్ధి జరగడం లేదని చంద్రబాబు ఆక్షేపించారు. ఈ-క్రాప్ నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారని చంద్రబాబు మండిపడ్డారు.


నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దళితుడైన నారాయణ పోలీసులు కొట్టిన దెబ్బల కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని చంద్రబాబు మండిపడ్డారు. తక్షణమే నారాయణ మృతి పట్ల సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు  డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా అల్లూరులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సమస్యలపై ప్రశ్నించిన కవిత అనే మహిళను వేధించడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. బాధిత మహిళ కవితకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: