వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకూ.. సీఎం జగన్‌కూ ఉన్న గొడవ తెలిసిందే. ఆయన సొంత పార్టీలోనే శత్రువుగా మారారు. ఇటీవల ఆయన సొంత నియోజక వర్గంలో ప్రధాని కార్యక్రమం జరిగినా ఆయన రాలేకపోయారు. అయితే.. సీఎం జగన్ తనను పట్టుబట్టి మరీ ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా చేశారని ఆయన కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. అయితే.. అలా ఆరోపించడమే కాదు.. ఇప్పుడు ఏకంగా ఆయన ఈ అంశంపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు ఫిర్యాదు చేశారు.

అఖిల భారత సర్వీసు అధికారులపై ముఖ్యమంత్రి పేషీ వేధింపులను అడ్డుకోవాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో  ప్రభుత్వ పాలనా నియమాలను గాలికి వదిలేశారని ఆయన లేఖలో తెలిపారు. ఏపీలో  అరాచక పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో వివరించారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసు అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడం మినహా ఏ ఒక్క పనీ చేయడం లేదని ఎంపీ రఘురామ తన లేఖలో తెలిపారు.


ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంతృప్తి పర్చేందుకు ఐఏఎస్‌లు ఏకపక్షంగా పని చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం తాను హాజరుకావల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందని ఎంపీ రాజీవ్‌ గౌబా దృష్టికి తీసుకెళ్లారు. తన ఫోన్ కాల్‌కి సమాధానమిచ్చినందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతిని సీఎం కార్యాలయానికి పిలిపించి బెదిరించారని రఘురామ లేఖలో తెలిపారు.


సీఎం కార్యాలయం నుంచి అటువంటి బెదిరింపులను నిరోధించకపోతే బ్యూరోక్రసీ పూర్తిగా అచేతనమయ్యే ప్రమాదం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం అరాచకాలను బయటపెడుతున్నందుకే తనపై కుట్రలు చేస్తున్నారని తెలిపారు. తనపై రాజద్రోహం సహా ఇతర తప్పుడు కేసులు మోపారని... కస్టడీలో చిత్రహింసలు పెట్టారని వివరించారు. సుప్రీంకోర్టు జోక్యంతో తాను బయటకు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం దెబ్బతినడానికి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పాత్ర ఉందని రఘురామ ఆరోపించారు.మరి ఈ లేఖతో ఏమైనా ఫలితం ఉంటుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: