రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసి సంక్షభం సృష్టించిందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. వివిధ సంక్షేమ పథకాల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ ఇటీవల అసెంబ్లీ పరిసరాల్లో దశలవారీ ఆందోళనలు చేపట్టింది. తక్షణమే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు విడుదల చేయడంతోపాటు రద్దుచేసిన అన్నా క్యాంటిన్లు, పెళ్లి, పండుగ కానుకలు, విదేశీ విద్య పథకాలను పునరుద్దరించాలని డిమాండ్‌ చేస్తోంది.  సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభ పక్షం నిరసన చేపట్టింది.


వివిధ సంక్షేమ పథకాల రద్దు నిరసిస్తూ అసెంబ్లీ వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్లు,  పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలను రద్దు నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా,  కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత  తదితర అంశాలపై ఆందోళన చేపట్టారు. రేషన్ బియ్యం కుంభకోణం,ఎస్సి,ఎస్టి,బీసీలకు నయవంచన నినాదాలతో  కాలినడకన  అసెంబ్లీకి వెళ్లారు.


వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని టీడీపీ  నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం అమలు చేసిన పథకాల పేర్లు మార్చి సగం కూడా ఇవ్వట్లేదని దుయ్యబట్టారు. వైసీపీ నేతలే బియ్యం అక్రమ రవాణా చేస్తూ సంక్షేమానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. పేదల పథకాలు రద్దు చేసిందని, ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టి బడుగు బలహీన వర్గాలను నాశనం చేస్తోందంటూ టీడీపీ  ఎస్సీ నేతలు కూడా ఇటీవల ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు.


ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభం లోకి నెట్టిందని నిరసిస్తూ అసెంబ్లీ సమీపంలో తెలుగుదేశం నేతలు ఓ భవనం కూడా ఎక్కి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో టీడీపీ  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు నేతలు పాల్గోన్నారు. మొత్తం మీద తెలుగు దేశం సంక్షేమం అన్న కోణంలో ఆందోళనలు ఉధృతం చేస్తోంది. బడుగుల తరపున పోరాడే పార్టీగా ప్రొజెక్ట్ చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: