టీడీపీకి కంచుకోట అయిన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఆధిప‌త్యం చాటుకుంది. జిల్లాలో 15 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్ల‌లో ఏలూరు, న‌ర‌సాపురం ఎంపీ సీట్ల‌తో పాటు జిల్లాలో 13 ఎమ్మెల్యే సీట్ల‌లోనూ విజ‌యం సాధించింది. కేవ‌లం పాల‌కొల్లు, ఉండి సీట్ల‌లో మాత్ర‌మే టీడీపీ గెలిచింది. ఇక జిల్లాలో పాక్షికంగా విస్త‌రించి ఉన్న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ సీటు సైతం వైసీపీ గెలుచుకుంది. ఈ ఇర‌వై నెల‌ల వైసీపీ పాల‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు పెట్టుకున్న న‌మ్మ‌కాలు వ‌మ్మ‌య్యాయ‌నే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు అవుతోన్న సంక్షేమ ప‌థ‌కాలు ఈ జిల్లాలో కూడా అమ‌లు అవుతున్నా ప్ర‌త్యేకంగా ఇక్క‌డ జ‌రిగిన అభివృద్ధి లేదు.

జిల్లాలో మెట్ట ప్రాంతంలో రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలుగా ఉన్న చింత‌ల‌పూడి - పోల‌వ‌రం - గోపాల‌పురం - కొవ్వూరు తో పాటు ఉంగుటూరు, దెందులూరు నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్ల ప‌రిస్థితి అధ్వానంగా ఉంది. రిజ‌ర్వ్ డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీలో గ్రూపుల గోల ఎక్కువుగా ఉంది. ఇక్క‌డ ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ద్వితీయ శ్రేణి నాయ‌కుల మ‌ధ్య ఏ మాత్రం పొస‌గ‌డం లేదు. చింత‌ల‌పూడిలో పైకి ఎంత స‌ర్ది చెప్పుకున్నా ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే వ‌ర్గాల మ‌ధ్య కోల్డ్ వార్ అయితే ఉంద‌నే వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. పోల‌వ‌రంలో కూడా సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న బాల‌రాజును వ్య‌తిరేకించే వ‌ర్గం స్ట్రాంగ్ అవుతోంది.

కొవ్వూరులో మంత్రి తానేటి వ‌నిత‌కు స్థానికంగా పార్టీ నేత‌ల సెగ ఎక్కువుగానే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కొంద‌రు నేత‌లు వనిత నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్నారు. గోపాల‌పురం వైసీపీలో గ్రూపు త‌గాదాలు చాప‌కింద నీరులా విస్త‌రిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీలో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఇక ఉంగుటూరులో ఎమ్మెల్యే వాసుబాబు కంటే .. మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు దూకుడు ఎక్కువుగా ఉంది. గ‌న్ని నిరంత‌రం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు.

దెందులూరులో గ‌త ఎన్నిక‌ల్లో అబ్బ‌య్య చౌద‌రి విజ‌యం ఏక‌ప‌క్షం అయినా ఈ సారి అక్క‌డ టీడీపీ పుంజుకునే అవ‌కాశాలున్నాయి. ఏదేమైనా ప‌శ్చిమ మెట్ట ప్రాంతంలో ఫ్యాన్ జోరుకు చాలా చోట్ల బ్రేకులు ప‌డే ఛాన్సులు ఉన్న‌ట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: