వివేకా హత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. కేసు ఓ కొలిక్కి వస్తుందన్న భావన నెలకొంది. ఈ సమయంలో పులివెందులలోని ఆయన ఇంటిని ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. ఈ అంశంపై వివేకా కూతురు ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని... తక్షణం తమ కుటుంబానికి పోలీసు భద్రత కల్పించాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మణికంఠారెడ్డి ఎవరు.. ఆయన వివేకా ఇంటి వద్ద ఎందుకు రెక్కీ నిర్వహించారు.. ఆయనకూ వివేకా హత్యకూ ఏంటి సంబంధం.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఇంతకీ ఈ మణికంఠారెడ్డి ఎవరంటే.. ఆయన వివేకా హత్య కేసులో ఒక అనుమానితుడైన  దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి. ఈయనతో పాటు పలువురు అనుమానితులను  సీబీఐ ఇటీవల విచారించింది. వైసీపీ నేత అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడు మణికంఠారెడ్డి రెక్కీ చేశాడని సునీత ఆరోపించారు.  ఈ నెల 10న సాయంత్రం 5 గంటల సమయంలో పులివెందులలోని తమ ఇంటి వద్ద అనుమానితుడు రెక్కీ చేశాడని సునీత  తనే లేఖలో పేర్కొన్నారు. మణికంఠారెడ్డి రెండుసార్లు బైకుపై ఇంటి వైపు వచ్చివెళ్లాడట.


మణికంఠారెడ్డి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా సునీత గుర్తించారు. దీనిపై  పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డికి సునీత ఫిర్యాదు చేశారు. ఆయన వివేకా ఇంటికి వచ్చి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు కూడా. అప్పుడే ఆ వ్యక్తిని మణికంఠారెడ్డిగా గుర్తించారు. ఈ మణికంఠారెడ్డి వైసీపీ  రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి అనుచరుడిగా  గుర్తించారు. ఇటీవలే ఈ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పుట్టిన రోజు జరిగింది. దీనికి మణికంఠారెడ్డి పులివెందులలో భారీ ఫ్లెక్సీలు వేశాడట. అయితే పోలీసులు  మణికంఠారె‌డ్డిని విచారించిన తర్వాత ఫ్లెక్సీలు తొలగించారు.


సునీత తన ఫిర్యాదులో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ కడప ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. సునీత లేఖపై సాయంత్రం ఎస్పీ అన్బురాజన్ స్పందించారు. వివేకా ఇంటివద్ద శాశ్వత ప్రాతిపదికన పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మొత్తానికి వివేకా హత్య కేసు పలు మలుపులు తిరుగుతూ ఓ కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: