ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాలితో దూకుతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. రిపబ్లికి సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌తో మొదలైన వివాదం... ఇప్పుడు రాజకీయ మాటల యుద్ధానికి దారి తీసింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్‌ను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త మార్గాన్ని వెతికింది. అసలు వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించలేదు కూడా. సినిమా టికెట్లు ప్రభుత్వమే ఆన్ లైన్‌లో విక్రయించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు పవన్ కల్యాణ్. ఇదే విషయాన్ని గట్టిగా నిలదీశారు కూడా. అయితే మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఆవేశంగా ప్రసంగిస్తున్న సమయంలోనే సినీ బడా నిర్మాతలతో మంత్రి పేర్ని నాని సమావేశమయ్యారు. అలాగే రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ వాడిన భాషకు చిరంజీవి స్వయంగా సారీ చెప్పారని మంత్రి నాని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇప్పుడు మరోసారి చిరంజీవితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది వైసీపీ. రాజమహేంద్రవరంలో దివంగత హాస్య నటుడు, తన మామ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్నిమెగాస్టార్ చిరంజీవి  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలో ఈ మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు మెగాస్టార్. ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ తరఫున అల్లు అరవింద్, నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. అయితే ఇదే కార్యక్రమానికి వైసీపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలరావుతో పాటు ఎంపీలు మార్గాని భరత్, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా హజరయ్యారు. ఓ వైపు తమ్ముడు పవన్‌తో వైరం కొనసాగిస్తూనే... మరోవైపు అన్న చిరంజీవిని దగ్గర చేసుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: