ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకు కృష్ణా జిల్లా పెట్టింది పేరు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలకు పుట్టినల్లుగా బెజవాడను పేరు చెబుతారు కూడా. ఇలాంటి కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు కంచుకోటగా చెప్పుకునే మైలవరం నియోజకవర్గంలో... ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. దేవినేని ఉమాను ఓడించి తీరుతానంటూ వైసీపీ నేత వసంత కృష్ణప్రసాద్ చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటి నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా కొండపల్లిలో గ్రావెల్ తవ్వకల్లో అక్రమాలు జరిగాయంటూ దేవినేని ఉమా చేసిన ఆరోపణలపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చివరికి దేవినేని ఉమా మహేశ్వర రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో... ఆయన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో కూడా ఉంచారు.

దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు.... మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూకుడుకు కళ్లెం వేయాలని తెలుగు తమ్ముళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం ఇప్పటికే కొండపల్లి మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులకు కొండపల్లి మునిసిపల్ బాధ్యతను అప్పగించింది తెలుగు దేశం పార్టీ అధిష్ఠానం. అలాగే పుర పోరు కోసం అటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కూడా ఒకరోజు రోడ్ షో నిర్వహించేందుకు టూర్ ప్లాన్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అటు రాజధాని అమరావతి సమీప మునిసిపాలిటి కావడం... ఇటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి కావడంతో... కొండపల్లి మునిసిపాలిటీపై పసుపు జెండా ఎగుర వేసేందుకు తెలుగు దేశం పార్టీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. చూడాలి మరి... కొండపల్లి పుర పోరులో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: