ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు మంత్రి బొత్స సత్యనారాయణ. గత రెండు దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలపై బొత్స తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. ఒక‌ప్పుడు కాంగ్రెస్ ... ఇప్పుడు వైసీపీ లో ఉన్నా సరే బొత్స హ‌వా నడుస్తూ ఉంది. జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో ఆయన అనుచరులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక జడ్పీ చైర్మన్ గా బొత్స మేన‌ళ్లుడు మ‌జ్జి శ్రీనివాస రావు ఉన్నారు. బొత్స‌ చీపురుపల్లి ఎమ్మెల్యే గా ఉంటే ... ఆయన సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇక ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు బొత్స‌కు ప్ర‌ధాన‌ అనుచరుడు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్పలనాయుడు బొత్స‌కు స‌మీప‌ బంధువు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం బతుకు దగ్గర వ్యక్తి. బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు కూడా బొత్స వర్గానికి చెందిన నేత. పార్వ‌తీపురం ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు సైతం బొత్స వ‌ర్గంలోని నేతే. ఇలా జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో బొత్స వర్గం వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

అయితే వచ్చే ఎన్నికల్లో వీరిలో కొందరికి టిక్కెట్లు రావు అన్న ప్రచారం జరుగుతోంది. గజపతినగరం ఎమ్మెల్యే గా ఉన్న అప్పల నరసయ్య మినహా మిగిలినవారిలో నెల్లిమర్లలో అప్పలనాయుడు - ఎస్.కోట లో శ్రీనివాసరావు - పార్వతీపురం లో జోగారావు లాంటి నేతలను ఈసారి జగన్ పక్కన పెట్టేస్తారు అన్న‌ ప్రచారం జరుగుతోంది. ఇక విజయనగరం ఎంపీగా కూడా బొత్స వర్గంగా ఉన్న చంద్రశేఖర్ కు సీటు దక్కకపోవచ్చు.

విజ‌య‌న‌గ‌రం రాజ వంశానికి చెందిన సంచ‌యిత పార్టీలోకి వస్తే ఆమెకు ఎంపీ సీటు ఇస్తారని అంటున్నారు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో బొత్స హ‌కు జిల్లాలో పూర్తిగా బ్రేకులు పడనున్నాయి. ఇక బొత్స కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా ?  లేదా ?  రాజ్య‌స‌భ‌కు వెళ‌తారా ? అన్న చ‌ర్చ‌లు కూడా జిల్లాలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: