అధికారపార్టీలో సఫకేషన్ను కొందరు నేతలు తట్టుకోలేకపోతున్నారా ? అవుననే అనిపిస్తోంది వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. సఫకేషన్ తట్టుకోలేకపోతున్న నేతలెవరంటే ఎన్నికలకు ముందు, తర్వాత తెలుగుదేశంపార్టీలో నుండి వైసీపీలో చేరిన నేతలు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన నేతలేమో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి అయిపోయిందని కాబట్టి చంద్రబాబునాయుడుతో ఉంటే లాభం లేదనుకుని వైసీపీలోకి జంపయిపోయారు. వైసీపీ అధికారంలోకి వస్తే అందలాలు ఎక్కవచ్చని కూడా అనుకున్నారు.




ఇక రెండోరకం నేతలు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళేమిటంటే అధికారపార్టీలో ఉంటే ఏదో చేసేసుకోవచ్చని, తమ మాట బాగా చెల్లుబాటు చేసుకోవచ్చని అనుకున్న వాళ్ళు. అయితే ముందొచ్చిన తర్వాత వచ్చిన నేతల మాట ఏమీ చెల్లటంలేదని సమాచారం. ఇలాంటి నేతలంతా వైసీపీలో ఉండలేక బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మంచి ముహూర్తం చూసుకుని తిరిగి ఘర్ వాపసీ ప్రోగ్రామ్ పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.




ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పచ్చనుకున్నారు. కానీ చక్రమే దొరకలేదు. భవిష్యత్తులో దొరుకుతుందనే ఆశకూడా పోయినట్లుంది. అందుకనే పార్టీలో రచ్చ మొదలుపెట్టారు. ఏదోరోజు తిరిగి టీడీపీలోకి వెళిపోవటం ఖాయమంటున్నారు. నిత్య అసమ్మతివాదిగా ముద్రపడిన ఆనం టీడీపీలో ఈసారైనా సర్దుకుంటారా ? ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేరిన కడప నేతలు రామసుబ్బారెడ్డి, వీరశివారెడ్డి, సతీష్ రెడ్డి కతకూడా సేమ్ టు సేమ్. అధికార పార్టీలో ఉంటే ఏమో చేసేసుకోవచ్చనుకున్నారు. అది సాధ్యం కాకపోగా పార్టీలో ఇమడలేకపోతున్నారు.




కర్నూలు జిల్లా నేతలు బుట్టారేణుక, ఎస్వీ మోహనరెడ్డి అదే కత. వీళ్ళు ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చినా ఇప్పటివరకు దక్కిందేమీ లేదు. పైగా స్ధానిక నేతలతో ఏమాత్రం పడకపోగా వీళ్ళను ఎవరు దేకటంకూడా లేదు. అందుకనే వీళ్ళు మళ్ళీ ఘర్ వాపసీ ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇలాంటి నేతలు వెళ్ళిపోతే వైసీపీ నేతలు హ్యాపీ ఫీలవతారనటంలో సందేహమేలేదు.  ఇక్కడ గమనించాల్సిందేమంటే వీళ్ళెవరినీ జగన్మోహన్ రెడ్డి రమ్మనలేదు కాబట్టి వెళతామంటే ఆపేదీలేదు.   మరా ముహూర్తం ఎప్పుడో చూడాల్సిందే.







మరింత సమాచారం తెలుసుకోండి: