తాజాగా వైజాగ్ లోని రామకృష్ణా బీచ్ రోడ్డులో జరిగిన ర్యాలీ, బహిరంగసభ తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. అధికార వికేంద్రీకరణ, మూడురాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగసభ జరిగింది. అందరు ఊహించినట్లే ర్యాలీ, బహిరంగసభ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. పేరుకు నాన్ పొలిటికల్ జేఏసీనే కానీ వైసీపీ మద్దతుందని అందరికీ తెలిసిందే.





కాబట్టి ర్యాలీ, బహిరంగసభ సక్సెస్ క్రెడిట్ అంతా అధికారపార్టీకే దక్కుతుంది. ఈ మొత్తంలో బయటపడిందేమంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయని. ఇప్పటివరకు అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని చంద్రబాబునాయుడు అండ్ కో బలంగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు డిమాండునే ఉత్తరాంధ్రలోని తమ్ముళ్ళు కూడా వినిపిస్తున్నారేకానీ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అవసరంలేదని డైరెక్టుగా చెప్పలేకపోతున్నారు.





తాజా ర్యాలీ, బహిరంగసభ ద్వారా ఉత్తరాంధ్రలోని టీడీపీ, జనసేనతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను వ్యతిరేకిస్తున్నాయనే విషయం జనాలందరికీ అర్ధమైంది. మరి విశాఖను ఇంతగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లేయమని జనాలను ఎలాగ అడుగుతాయి ? ప్రచారానికి వెళ్ళినపుడు జనాలు ఇదే విషయంపై నిలదీస్తే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్ జనాలకు ఏమని సమాధానం చెబుతారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలన్నదే తమ డిమాండని వీళ్ళు చెబితే జనాలు వీళ్ళకు ఎందుకు ఓట్లేస్తారు ?





ఉత్తరాంధ్రవాసిగా ఉన్న అచ్చెన్న లేదా తమ్ముళ్ళు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను వ్యతిరేకించి తప్పుచేశారనే ప్రచారం మొదలైంది. పార్టీలైన్ ప్రకారం వ్యతిరేకించక చేయగలిగేది కూడా ఏమీలేదు. ఇదే ఇపుడు టీడీపీ, జనసేన నేతలను బాగా ఇబ్బందులకు గురిచేస్తోంది. విశాఖలో జోరున వర్షం పడుతున్నా ర్యాలీ, బిహిరంగసభ సక్సెస్ అయ్యిందేనే సెంటిమెంటు రాజుకుంటోందనే అర్ధమవుతోంది. మరి దీన్నిచూసిన తర్వాతయినా తమ్ముళ్ళు, జనసేన నేతల్లో పునరాలోచన మొదలవుతుందేమో చూడాలి. లేకపోతే వచ్చేఎన్నికల్లో వీళ్ళకు ఎదురుదెబ్బలు తప్పేట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: