ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రేపే నిర్ణయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తప్పనిసరిగా పోటీ చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారు. ఓటమి భయంతో వెనక్కు తగ్గడం పార్టీకి తప్పుడు సంకేతాలను పంపుతుందని, నేతలు, కార్యకర్తలు గ్రామ స్థాయిలో డీలా పడతారని జగన్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పులివెందుల ఎంపీటీసీ ఉప ఎన్నికలో పార్టీకి ఎదురైన షాక్ కారణంగా కొందరు నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ వద్దని జగన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం “ఓటమి భయంతో పోటీ తప్పించుకోవడం అంటే పార్టీకి శాసనంగా దెబ్బ తీయడమే” అని స్పష్టం చేసినట్లు సమాచారం. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలంటే, గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఎన్నికల్లో తలపడటం తప్పనిసరి అని ఆయన తేల్చేశారు.

ఇటీవల జరిగిన నేతల సమావేశంలో జగన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. బూత్ లెవెల్ కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసి, వాటిని శక్తివంతం చేయాలని సూచించారు. గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీకి కొత్త జోష్ తెచ్చేది ఈ ఎన్నికలేనని, వీటి ద్వారా అధికార – విపక్ష వర్గాలు స్పష్టంగా విడిపోతాయని, రాబోయే సాధారణ ఎన్నికలకు అదనపు అడ్వాంటేజ్ దొరుకుతుందని జగన్ లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. జగన్ అంచనా ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల రెండు కీలక ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి – పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతుంది. రెండోది – గ్రామ స్థాయిలో వైసీపీ ప్రభావం ఏ మేరకు ఉందో అంచనా వేసుకోవచ్చు. తద్వారా 2029 ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీ బలహీనతలు ఎక్కడున్నాయో గుర్తించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు కూడా జగన్ క్లియర్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. తమ పరిధిలో విశ్వసనీయమైన నేతలు, బలమైన కార్యకర్తలను ముందుకు తేవాలని, వారికి పోటీ చేసే అవకాశం కల్పించాలని చెప్పారు. “స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే వైసీపీ ఏ పెద్ద కార్యక్రమం చేపట్టినా ప్రజల్లో స్పందన భారీగా ఉంటుంది” అన్నది జగన్ లెక్క. అంటే వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీకి పెద్ద రాజకీయ పరీక్షగా మారబోతున్నాయి. ఓటమి భయాన్ని పక్కన పెట్టి, పార్టీని గ్రామస్థాయిలో పునర్వ్యవస్థీకరించేందుకు జగన్ ఈ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మళ్లీ కదిలే అవకాశం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: