
ఈ అప్పు వివరాల్లోకి వెళ్తే.. ఈ 2.37 లక్షల కోట్ల అప్పులో దేశీయ అప్పు 2,34,912 కోట్ల రూపాయలు. విదేశీ అప్పు 2,835 కోట్ల రూపాయలు ఉందట. రిజర్వ్ బ్యాంకు నుంచి మాత్రం తెలంగాణ ఎలాంటి అప్పు తీసుకోలేదట. అయితే.. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఖర్చుల మధ్య తలెత్తే అంతరాన్ని పూడ్చేందుకు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటి, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాన్ని మాత్రం ఆర్బీఐ కల్పించిందట. గత ఐదేళ్లలో తెలంగాణకు... విదేశీ ఆర్ధిక సంస్థలు కానీ, రీఫైనాన్సింగ్ సంస్థలు గానీ రుణాలు ఇవ్వలేదని కేంద్రం తెలిపింది.
ఇదే సందర్భంలో... 2016 నుంచి 2021 మధ్య కాలంలో విదేశీ ఆర్ధిక సాయంతో చేపట్టిన ప్రాజక్టులకు అదనపు కేంద్ర సాయం కింద 2,610 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చినట్టు కేంద్రం చెప్పింది. అలాగే 30 కోట్ల గ్రాంట్ ఇచ్చామని కేంద్రం చెప్పింది. వివిధ విదేశీ సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో అసలు కింద గత ఐదేళ్లలో 382 కోట్లు, వడ్డీ కింద 147 కోట్లు తెలంగాణ చెల్లించిందట. 2021 నుంచి 2023 మధ్య మూడేళ్ల కాలంలో తెలంగాణ అసలు కింద 462 కోట్లు, వడ్డీ కింద 67 కోట్లు చెల్లించాల్సి ఉందట.
లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆర్‌బిఐ, విదేశీ ఆర్ధిక సంస్థలు, రీఫైనాన్సింగ్ సంస్థలు గత ఐదేళ్లలో తెలంగాణకు ఇచ్చిన అప్పులు ఏంటి అని ఆయన ప్రశ్నించడంతో కేంద్ర ఆర్ధిక శాఖ సహయ మంత్రి పంకజ్ చౌదరి ఈ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో తెలంగాణ విదేశీ రుణాలు తీసుకోలేదని ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.