లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ చేరాలన్న ఆశలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నీళ్లు చల్లింది. సోమవారం లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్ నంబర్ 61లో, ఆరు వికెట్ల తేడాతో SRH ఘన విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన SRH, మరో 10 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసి, LSG ని టోర్నీ నుంచి సాగనంపింది.

SRH ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 59 పరుగులు బాదేశాడు. అథర్వ తైడేతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన అభిషేక్, ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో SRH ఎనిమిది ఓవర్లలోపే 99 పరుగులు సాధించింది. అయితే, దిగ్వేష్ రాఠీ వేసిన వైడ్ గూగ్లీని స్వీపర్ కవర్‌కు స్లైస్ చేసి అభిషేక్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.

అభిషేక్ ఔటైనా SRH ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇషాన్ కిషన్ 28 బంతుల్లో 35 పరుగులు చేసి దూకుడు కొనసాగించాడు. హెన్రిచ్ క్లాసెన్ 28 బంతుల్లో 47 పరుగులు చేసి ఛేజింగ్‌ను ట్రాక్‌లో ఉంచాడు. కమిందు మెండిస్ కూడా తన వంతు పాత్ర పోషించాడు, కానీ గెలుపుకు కేవలం తొమ్మిది పరుగులు అవసరమైన దశలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అనికేత్ వర్మ, నితీష్ రెడ్డి ప్రశాంతంగా ఆడి 19వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించారు.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన LSG, నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరునే సాధించింది. మిచెల్ మార్ష్ 39 బంతుల్లో 65 పరుగులు, ఐడెన్ మార్క్‌రమ్ 38 బంతుల్లో 61 పరుగులు చేయగా, చివర్లో నికోలస్ పూరన్ 26 బంతుల్లో 45 పరుగులతో మెరుపులు మెరిపించాడు. అయితే, LSG బౌలర్లు ఈ భారీ స్కోరును కాపాడుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. ఒక్క దిగ్వేష్ రాఠీ మాత్రమే 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మిగతా బౌలర్లు SRH బ్యాటర్ల దూకుడును అడ్డుకోలేకపోయారు.

ఈ ఓటమితో, ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ఐదో జట్టుగా LSG నిలిచింది. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడైన రిషబ్ పంత్, ఈ సీజన్‌లో నిరాశాజనకమైన ప్రదర్శనతో టోర్నీని ముగించాడు. SRH ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగినప్పటికీ, LSG అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఇక ఇప్పుడు నాలుగో ప్లేఆఫ్ స్థానం కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మాత్రమే పోటీలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: