ఈ కాలంలో వాట్సాప్ వాడకుంటే ప్రాణాలు పోతున్నట్లుగా చాల మంది ఫీలవుతున్నారు. ఇక ఇప్పుడున్నదంతా డిజిటల్ కాలమే అన్ని మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. ఓ క్షణం సెల్ స్విచ్చాఫ్ ఐతే బోనులో పడ్డ ఎలుకలా మనిషి గిజగిజలాడుతుంటాడు. ఇకపోతే ప్రస్తుతం అన్ని లావాదేవిలు కూడా మొబైల్ ద్వారనే జరుగుతున్నాయి.


ఇలాంటి విధానాన్ని తమ యూజర్లకు అందించాలని డిజిటల్‌ చెల్లింపుల రంగంలో ఇతర ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సంస్థలకు దీటుగా పేమెంట్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేట్లు కనిపించడం లేదు. ఎందుకంటే యూజర్ల వివరాలను గోప్యంగా ఉంచడంలో వాట్సాప్‌ సామర్థ్యంపై నెలకొన్న సందేహాలే ఇందుకు కారణం. 


అంతే కాకుండా ఇతరత్రా దేశీ చెల్లింపుల సంస్థలు, బ్యాంకులు పాటించే పారదర్శకతను ‘వాట్సాప్‌ పే’ పట్టించుకోకపోవడం వల్ల అధికారులు వాట్సాప్‌ పేమెంట్స్‌ యాప్‌ విషయంలో ఆసక్తి కనబరచడం లేదట. ఇదే కాకుండా యూజర్లు జరిపే ఆర్థిక లావాదేవీల వివరాలను నిబంధనల ప్రకారం భారత్‌లోనే భద్రపరుస్తోందా లేదా అన్న విషయాన్ని కూడా వాట్సాప్‌ సూటిగా చెప్పకపోతుండటం సంస్థ తీరుపై అనుమానాలకు తావిస్తోంది.


ఈ పరిస్థితుల్లో ఏకీకృత చెల్లింపుల విధానాన్ని వినియోగించడానికి వాట్సాప్‌నకు అనుమతులిచ్చిన పక్షంలో.. మొత్తం పేమెంట్స్‌ వ్యవస్థకే ముప్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలు ఆందోళన చెందుతున్నాయి. కాబట్టి.. యూపీఐని వాడుకోవటానికి వాట్సాప్‌నకు అనుమతి ఇవ్వరాదని భావిస్తున్నాయి.


ఇకపోతే వాట్సాప్‌ పే ద్వారా చెల్లింపుల విధానం ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. దీన్ని ఈ ఏడాదే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలని వాట్సాప్‌ భావించినప్పటికీ .. తాజా పరిస్థితుల నేపథ్యంలో అది ఇప్పుడప్పుడే సాధ్యపడేలా లేదు. సో వాట్సాప్ యూజర్లకు ఇది కొంత బ్యాడ్ న్యూస్ అని చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: