ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారా... అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కూడా కేంద్రమే పంచాయతీ చేస్తోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా వారం రోజులుగా హస్తినలోనే మకాం వేసి రాష్ట్ర సమస్యలను దగ్గరుండి మరీ చక్కబెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాను కూడా ఢిల్లీ వెళ్లాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధానంగా నీటి సమస్య తారాస్థాయికి చేరుకుంది. అటు కేఆర్ఎంబీ నిర్వహించే సమావేశాలకు కూడా తెలంగాణ రాష్ట్రం హాజరయ్యేది లేదని తేల్చి చెప్పింది. అదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఓ లేఖ కూడా ఇచ్చారు.

ఇటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా హస్తిన పర్యటనకు రెడీ అవుతున్నారు. రేపో.. మాపో... ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నారు. అలాగే ఇతర మంత్రులను కూడా కలిసేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో జగన్ ప్రధానంగా చర్చించనున్నారు. క్రెడిట్‌పై లాక్ పెట్టడంతో ప్రస్తుతం జీతాలు చెల్లించేందుకు కూడా ఏపీ సర్కార్ నానా పాట్లు పడుతోంది. దీనిపై కూడా జగన్ చర్చించనున్నారు. అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు కూడా జగన్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్లు అధ్వాన్నాంగా తయారయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని గడ్కరీతో చర్చించి... రాష్ట్రానికి మరిన్ని నిధుల కేటాయింపు జరిగేలా జగన్ ప్రయత్నిస్తున్నారు. అటు కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ ప్రస్తుతానికి ఎలాంటి విభేదాలు లేకుండా సాగుతోంది. అయితే రాష్ట్రంంలో మాత్రం వైసీపీ సర్కార్‌పై బీజేపీ నేతలు ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వినాయక చవితి పండుగ రగడ జరుగుతోంది. ఈ విషయాలను కూడా కేంద్ర పెద్దలతో చర్చించాలనేది వైఎస్ జగన్ భావన. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు వైసీపీకి కొంత ఇబ్బందిగా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా బీజేపీ పెద్దల దగ్గర జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తానికి సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి అన్ని విషయాలు స్వయంగా చక్కబెట్టాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: