ఏపీ సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్య ఉదంతం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇటీవల ఈ కేసులో నిందితుడైన దస్తగిరి వాంగ్మూలం బయటకు రావడం కలకలం సృష్టించింది. తాను, ఎర్ర గంగిరెడ్డి, మరికొందరు ఈ హత్యలో పాల్గొన్నామన్న దస్తగిరి.. ఈ హత్య వెనుక వైఎస్ కుటుంబ పెద్దలు ఉన్నారని తనతో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ హత్యతో ఎంపీ అవినాశ్‌ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.


తాజాగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం లేదని.. అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే నాతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
శివప్రసాద రెడ్డి అన్నారు. కడప జిల్లాలోని ఎమ్మెల్యేలందరం కలిసి మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి.. అవినాష్ రెడ్డిని హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం తెర వెనుక చేస్తున్నారని మండిపడ్డారు.


తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఎర్రగంగిరెడ్డి మరో ముగ్గురిని కలుపుకుని హత్య చేసేందుకు పథకం వేశారన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి.. వివేకా హత్యలో పాల్గొన్నానని  దస్తగిరి వాంగ్మూలం ఇస్తే అతన్ని ఇంతవరకు సీ బీ ఐ అధికారులు ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నించారు. హంతకుడిని సాక్షిగా మార్చమని సీబీఐ కోరుతోందని.. వివేక హత్యకు ఎర్రగంగిరెడ్డే మూలం అని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి చెబుతున్నారు.


వైఎస్‌ వివేకాను ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, ఉమామహేశ్వర రెడ్డి, సునీల్ యాదవ్ మాత్రమే హత్య చేశారని.. ఈ హత్యతో ఎంపీ అవినాష్ కు ఏమాత్రం ప్రమేయం లేదని చెబుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.  ఈ హత్యతో ఎంపీ అవినాశ్ రెడ్డికి సంబంధం ఉన్నా.. లేకపోయినా.. దస్తగిరి వాంగ్మూలంతో మాత్రం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: