ఏపీ వైసిపి సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయంగా ఎప్పుడు తనదైన స్టైల్లో స్పందిస్తూ ఉంటారు. ఆయన ఏం చెబుతున్నారో క్లారిటీ లేకపోయినా ప్రతిపక్షాలపై మాత్రం ఎప్పుడూ కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయన తన తాజా ఇంటర్వ్యూలో ఓ పవర్ ఫుల్ డైలాగ్ వేశారు. తాను సింహాన్ని అని చెప్పిన బొత్స ఎప్పుడూ ఒకేలా ఉంటానన్నారు. సింహం అడవిలో ఉన్న.. స‌ర్క‌స్‌ లో ఉన్నా ఒకటే అని.. దాని ప‌వ‌ర్ లో మాత్రం ఎలాంటి తేడా ఉండదని ఆయన చెప్పారు. పార్టీలు మారినంత మాత్రాన త‌న పవర్ మాత్రం ఎక్కడా తగ్గలేదని ... తన హవా తగ్గింది అంటున్న వారు చేతనైతే దానిని నిరూపించాలని సవాల్ చేశారు.

కాంగ్రెస్ లో ఉన్న వైసిపి లో ఉన్నా ఎప్పుడూ ఒకేలా వ్యవహరిస్తానని చెప్పిన బొత్స ... జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల మధ్య ఆలోచనలతో పాటు అనేక ఇతర విషయాల్లో తేడా ఉంటుందని ఆయన వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ లాంటి మహాసముద్రంలో పనిచేశానని ... అలాగే ఇప్పుడు జగన్ నాయకత్వంలో కూడా చాలా సంతోషంగా పని చేస్తున్నానని చెప్పారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన బొత్స పలుకుబడి ఇప్పుడు తగ్గిందని జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు.

అవ‌న్నీ అవాస్త‌వాలే అని కొట్టి ప‌డేశారు. ఇక బొత్స‌ సతీమణి ఝాన్సీకి టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇక మంత్రివర్గ విస్తరణలో తన పదవి ఉంటుందా ? ఊడుతుందా అన్న ప్రశ్నకు కూడా ఆయన స్పందించారు. ఇది పూర్తిగా ఊహాజనితమైన ప్రశ్న అని .. మంత్రివర్గంలో ఎవరు ఉండాలి ? ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లాలి ? అనేది పూర్తిగా ముఖ్య‌మంత్రి నిర్ణయం అని చెప్పారు. ఏదేమైనా బొత్స ఎన్ని చెప్పినా కూడా గ‌తంతో పోలిస్తే ఆయ‌న‌కు ప్ర‌భుత్వం లో పెద్ద ప్ర‌యార్టీ లేద‌నే వారే ఎక్కువ మంది ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: