దసరా సమయంలో సింగరేణి కార్మికులకు బోనస్ ఇచ్చారు.  సింగరేణి నుంచి దండిగా లాభాలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  అయితే, గత కొంతకాలంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని కోరుతూ సమ్మెకు దిగారు.  గత పదిరోజులుగా వారు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  పైగా సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. 


దీంతో సమ్మె ఉదృతంగా మారింది.  ఇద్దరు కార్మికులు ఆత్మత్యాగం చేశారు.  దీంతో పరిస్థితి చేయిదాటిపోయేలా కనిపించడంతో చర్చలకు రావాలని కెకె మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధం అయ్యారు.  అయితే, కార్మికులు మాత్రం చర్చలు జరపాలి అంటే.. ప్రభుత్వం ముందు ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇవ్వాలని అంటున్నారు.  తమ మ్యానిఫెస్టోలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పలేదని, ఇప్పుడు దీన్ని చేయాలి అంటే దానికి సంబంధించిన విధివిధానాలు అన్ని మార్చాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్తున్నది.  


ఇకపోతే, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. పారిశుధ్య కార్మికుల విషయంలో తెరాస ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  గ్రామ పంచాయితీల్లో ఉండే పారిశుధ్య కార్మికుల జీతాలు.. అక్కడి పరిస్థితులను బట్టి, అక్కడి జనాభాను బట్టి ఉండేవి.  కానీ, రాష్ట్రంలో గ్రామ పంచాయితీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఒకేరకమైన జీతాలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  


దీపావళి కానుకగా వీరి జీతాలను రూ. 8500/- చేసినట్టు ప్రభుత్వం సోమవారం రాత్రి హఠాత్తుగా ప్రకటించింది.  ఈ హఠాత్ ప్రకటనతో పారిశుధ్య కార్మికుల్లో ఆనందనం వెల్లివిరిసింది.  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో ఒకవేళ పారిశుధ్య కార్మికులు కూడా సమ్మెకు దిగితే... దానివలన జరిగే నష్టం అందరికి తెలిసిందే.  గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో భరించలేనంతగా కంపు పేరుకుపోతుంది.  బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకొని ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: