గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసక్తిపోరు జరగనుంది. జిల్లాలో కీలకంగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల నుంచి కమ్మ నేతలే తలపడుతున్నారు. ఎవరికి వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఈ విధంగా కమ్మ నేతల మధ్య వార్ జరుగుతున్న నియోజకవర్గాలు పెదకూరపాడు, వినుకొండ నియోజకవర్గాలు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండలో వైసీపీ నుంచి పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత, జిల్లా అధ్యక్షుడు జి‌వి ఆంజనేయులుని చిత్తుగా ఓడించారు.

 

ఇక అటు పెదకూరపాడులో టీడీపీ సీనియర్ నేత కొమ్మాలపాటి శ్రీధర్‌ని, వైసీపీ అభ్యర్ధి నంబూరు శంకరరావు ఓడించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రెండు పార్టీల నుంచి పోటీ చేసిన నేతలు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే. ఇక అప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తలపడిన ఈ కమ్మ నేతలు, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీపడుతున్నారు. వినుకొండలో చూసుకుంటే ఆంజనేయులు, బ్రహ్మనాయుడులు తమ తమ పార్టీ అభ్యర్ధులని గెలిపించుకునేందుకు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నారు.

 

నియోజకవర్గంలో ఉన్న అన్నీ మండలాల్లో పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఈపూరు, వినుకొండ, నూజెండ్ల, శావల్యాపురం, బొల్లేపల్లే మండలాలు ఉన్నాయి. ఆ ఐదు మండలాల్లో రెండు పార్టీల నుంచి గట్టి అభ్యర్ధులనే బరిలోకి దించారు. కాకపోతే అధికారంలో ఉండటం, ఈ 10 నెలల్లో నియోజకవర్గంలో బ్రహ్మనాయుడు మంచి పనితీరు కనబర్చడం వల్ల వినుకొండలో వైసీపీకే మెజారిటీ స్థానాలు వచ్చేలా ఉన్నాయి.

 

అటు పెదకూరపాడులో నంబూరు, కొమ్మాలపాటిల మధ్య కూడా గట్టి పోటీనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పగ తీర్చుకోవాలని కొమ్మాలపాటి చూస్తుంటే, మళ్ళీ కొమ్మాలపాటికి చెక్ పెట్టేయాలని నంబూరు అనుకుంటున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో బెల్లంకొండ, అచ్చంపేట క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు మండలాలు ఉన్నాయి. ఈ ఐదు మండలాల్లో రెండు పార్టీలు స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. పైగా అమరావతి దగ్గర ఉండటం వల్ల కొమ్మాలపాటికి చెక్ పెట్టడం నంబూరుకు కాస్త కష్టమే. కాకపోతే అధికారం ఒక్కటే అడ్వాంటేజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: