కరోనా. చైనా ఈ రెండింటినీ విడదీసి చదవడం ప్రపంచానికి బహు కష్టమవుతోంది. ఏది ఎంతవరకూ నిజమో కానీ చైనా నుంచే కరోనా వైరస్ ప్రపంచానికి పాకిందన్న దాన్ని మాత్రం అంతా గట్టిగానే నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే వూహన్ ల్యాబ్ లో కరోనా పుట్టి ఆ మీదట మెల్లగా లోకాన్ని చుట్టిందని ఇప్పటికీ అందరికీ పెద్ద డౌట్స్ ఉన్నాయి.

మరి ఈ గుట్టు మట్లను బయటపెట్టాలని ప్రపంచ దేశాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొంతమంది సైంటిస్టులను చైనాకు పంపించింది. అక్కడ కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలను అధ్యయనం చేసి నిజ నిర్ధారణ చేయాలని కోరింది. ఈ బృందం చైనాలో అడుగుపెడుతూనే కరోనా మరో మారు అక్కడ పడగ విప్పడం షాక్ కి గురి చేసిందట.

ఇక పద్నాలుగు రోజుల పాటు ఈ సైంటిస్టుల బృందం  చైనాలో  హోం క్వారంటైన్ లోఉంటూ అక్కడ ఉన్న పరిశోధకులతో వీడియా సమావేశాలు నిర్వహిస్తారు అంటున్నారు. ఆ మీదట వారు మొత్తం వూహాన్ లాబ్ తో సహా అనుమానించబడిన ప్రదేశాలను కూడా తనిఖీ చేస్తారని, తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారని అంటున్నారు. అయితే సైంటిస్టులను పంపుతామని ఇప్పటికి అనేక మార్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరినప్పటికీ అనుమతులు ఇవ్వకుండా ఇన్నాళ్ళూ జాప్యం చేసింది. ఇపుడు అనుమతులు ఇచ్చినా కూడా వూహాన్, ప్రావిన్స్ లో మళ్లీ కరోనా కేసులు పెద్ద ఎత్తున వ్యాపిస్తున్నాయని చెబుతూ అక్కడ లాక్ డౌన్ విధించడాన్ని కూడా అంతా గమనిస్తున్నారు.

మొత్తానికి వూహాన్ గుట్టును బయటకు తీయడానికి ప్రపంచ సైంటిస్తుల బృందం చైనాలో ఉంటే అక్కడ లాక్ డౌన్ పేరిట ఏ నిజాలు బయటకు రాకుండా డ్రాగన్ చూస్తోందా అన్న డౌట్లు అందరిలో కలుగుతున్నాయి. అయినా లాజిక్ తో ఆలోచిస్తే చైనా సైంటిస్టుల రాకను ఇన్ని సార్లు అడ్డుకోవడమే ఆ దేశం పట్ల అనుమానాలకు తావు ఇస్తోందని వేరే చెప్పాలా. మొత్తానికి నిజం నిగ్గు తేల్చక తప్పదు, అది ఏదో నాడు బయట పడకా తప్పదు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: