ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్‌ల అధినేత ఎలాన్ మస్క్‌కు ఓ భారతీయ విద్యార్థి భారీ షాకిచ్చాడు. పరువునష్టం దావా వేసి కోర్టుకీడ్చాడు. ఇంకా విశేషం ఏంటంటే ఈ కేసులో ఎలాన్ వాదనలను కోర్టు తోసిపుచ్చడమే కాకుండా సరైన ఆధారాలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో మస్క్‌కు భారీ షాక్ తగిలింది. రణదీప్ హోతి అనే భారత సంతతికి చెందిన యూనివర్సిటీ విద్యార్థి మస్క్‌పై స్థానిక కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసుపై విచారించిన కోర్టు మస్క్‌ను వివరణ కోరింది. ఆయన తరపు న్యాయవాది దీనిపై స్పందిస్తూ.. హోతి దాఖలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన క్లయింటు భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని వాదించారు. అయితే దీనిని న్యాయమూర్తి తోసిపుచ్చారు.

రణదీప్ హోతి బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. 2019 ఫిబ్రవరిలో విద్యుత్ కార్లపై అధ్యయనం చేయడం కోసం ఫ్రీమోంట్లోని టెస్లా ఆటో ప్లాంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో చిన్న ఘర్షణ జరిగింది. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్లో హోతి కారులో వెళ్తూ టెస్లా టెస్టు కారు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ రెండు సంఘటనలపై ఆగ్రహించిన మస్క్.. హోతిపై ఆన్లైన్ టెక్ ఎడిటర్కు ఫిర్యాదు చేశాడు. హోతీ చెప్పేవన్నీ అబద్ధాలని, అతడు కావాలనే తన సిబ్బంది గొడవ పడ్డాడని, తన కారు ఫోటోలు షేర్ చేశాడని మస్క్ తన ఫిర్యాదులో ఆరోపించాడు.

ఈ ఆరోపణలపై హైతీ తీవ్రంగా మండిపడ్డాడు. తన పరువును దిగజార్చేందుకే మస్క్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అక్కడితో ఆగకుండా 2019 ఆగస్టులో కోర్టును కూడా ఆశ్రయించాడు. మస్క్ కావాలనే తనపై ఆన్లైన్లో విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాడంటూ అలమెడా కౌంటీ సుపీరియర్ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ జులియా స్పెయిన్‌.. మస్క్ వాదనలను కొ్ట్టిపారేశారు. ఇరువురి వాదనలో నిజాలను తేల్చాల్సి ఉందని లిఖిత పూర్వక తీర్పులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రణదీప్ హోతి ప్రస్తుతం మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆసియా భాషలు, సంస్కృతులపై డాక్టరేట్ చేస్తున్న విద్యార్థి. మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీనీ, దాని ఉత్పత్తులను తరచుగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాడు. కార్పొరేట్ మోసాలపై దర్యాప్తు చేస్తూ, నిజాలను నిగ్గు తేల్చే రిపోర్టర్‌గా హోతీ చెప్పుకుంటుంటాడు. దీనికితోడు టెస్లాను తీవ్రంగా విమర్శించే ఓ గ్లోబల్ గ్రూపులో కూడా హోతి సభ్యుడుగా ఉన్నాడు. ఆన్‌లైన్ వేదికగా ఈ గ్రూపు మస్క్, టెస్లా కంపెనీలపై తరచూ ట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రూపులో టెస్లా మాజీ ఉద్యోగులు, హోతి లాంటి విద్యార్థులు, ఇతర నిపుణులు సభ్యులుగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: