ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలు ఉన్నప్పటికీ, వాటిని 32 జిల్లాలుగా పెంచాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించడానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించారు. రాష్ట్ర విభజన సమయానికి 13 జిల్లాలే ఉన్నా, వైసీపీ పాలనలో పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను పెంచి 25 జిల్లాలు చేశారు. అరకు పార్లమెంటు విస్తారంగా ఉండటంతో, దాన్ని రెండు జిల్లాలుగా విభజించారు.


కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రధాన సమస్య జిల్లా కేంద్రాల ఎంపికలోనే తలెత్తింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు నిర్ణయించిన జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండ‌డంతో తీవ్ర‌ వ్యతిరేకత వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో స్థానిక ప్రజల అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోకుండా, స్థానిక నేతల సూచనల మేరకే కేంద్రాలు నిర్ణయించటం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది. ఈ అసంతృప్తిని గమనించిన చంద్రబాబు, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రాలను మార్చుతామని హామీ ఇచ్చారు.


ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తున్నప్పటికీ, కొత్త జిల్లాల ఏర్పాటుపై మాత్రం డైల‌మాలో ఉంది. కొత్త జిల్లా ఏర్పాటు అంటే కొత్త ప్రభుత్వ కార్యాలయాలు, అదనపు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నియామకం, మౌలిక సదుపాయాల ఏర్పాటు వంటి భారీ ఖర్చు అవసరం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదన్న అభిప్రాయం పలువురు మంత్రుల నుండి వ్యక్తమైంది. అందుకే ఇప్పట్లో జిల్లా కేంద్రాల మార్పు, సరిహద్దుల సవరణలకే పరిమితం కావాలనే ఆలోచన వ్యక్తమవుతోంది.


అయితే, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి, దానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుతున్నారు. అలాగే, మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని, కేంద్రం మార్చాలని కూడా డిమాండ్ వస్తోంది. పలు ప్రాంతాల్లో పల్నాడు, మాన్యం, ఏలూరు జిల్లాల్లోనూ ఇలాంటి డిమాండ్లు ఉండటంతో, ఒకదాన్ని ఏర్పాటు చేస్తే మరిన్ని డిమాండ్లు తలెత్తే అవకాశం ఉంది. మరొకవైపు, సమయం కూడా తక్కువగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత రెండేళ్లపాటు జిల్లాల సరిహద్దులు మార్చడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఫిబ్రవరి నుంచి కుల గణన, ఆ తర్వాత జనాభా గణన ప్రారంభం కానున్న నేపథ్యంలో తక్కువ సమయంలో భారీ పనులు చేపట్టడం కష్టసాధ్యం అని మంత్రులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల ప్రభుత్వం ప్రస్తుతానికి కొత్త జిల్లాల ఏర్పాటును వాయిదా వేసి, జిల్లా కేంద్రాల మార్పు, సరిహద్దుల సవరణలపై దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: